
నిమజ్జనానికి వెళ్తుండగా అపశ్రుతి
● హైవేపై ట్రాక్టర్‌ను ఢీకొన్న డీసీఎం
● ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం.. మరొకరి పరిస్థితి విషమం
ఎర్రవల్లి: వినాయకుడి నిమజ్జనానికి వెళ్తున్న ట్రాక్టర్‌ను డీసీఎం వేగంగా వచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. అలాగే మరొకరి పరిస్థితి విషమంగా ఉండగా.. ఆరుగురికి గాయాలైన సంఘటన మండలంలోని కొట్టం కాలేజీ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి ఇటిక్యాల ఎస్‌ఐ రవినాయక్ కథనం ప్రకారం.. ఇటిక్యాలకు చెందిన బోయ జమ్మన్న(50), బోయ నర్సింహులు(48), అదే గ్రామానికి చెందిన మరో ఏడు మందితో కలిసి చెన్నకేశవస్వామి ఆలయం దగ్గర ఏర్పాటు చేసిన వినాయకుడిని బీచుపల్లి వద్ద కృష్ణానదిలో నిమజ్జనం చేసేందుకు ఆదివారం రాత్రి ట్రాక్టర్‌లో బయలుదేరారు. ఈ క్రమంలో జాతీయ రహదారిపై అర్ధరాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో కొట్టం కాలేజీ సమీపంలో వెళ్తుండగా కర్నూలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న డీసీఎం వేగంగా వచ్చి ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పల్టీలు కొట్టి రోడ్డు కిందకు దూసుకుపోవడంతో వినాయకుడితోపాటు అందులో ఉన్న వారంతా చెల్లాచెదురుగా పడిపోయారు. ప్రమాదంలో తీవ్ర రక్త గాయాలు కావడంతో బోయ జమ్మన్న అక్కడికక్కడే మృతిచెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా పరిస్థితి విషమించి బోయ నర్సింహులు మృత్యువాత పడ్డారు. అలాగే ప్రమాదంలో గాయాలపాలైన జ్ఞానేశ్వర్, నరేందర్, మహేందర్, రమేష్, రాముడు, యశ్వంత్, మధులను అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇందులో నరేందర్ తలకు తీవ్ర రక్త గాయాలు కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. ఈ ఘటనపై జమ్మన్న భార్య పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. వినాయకుడి నిమజ్జనోత్సవంలో అపశ్రుతి చోటు చేసుకొని ఇద్దరు మృతిచెందడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి.
మెడికల్ కళాశాలకు నేత్రాల అప్పగింత
రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నర్సింహులు నేత్రాలను కుటుంబ సభ్యులు కర్నూలు మెడికల్ కళాశాలకు అందజేశారు. నర్సింహులు భార్య లక్ష్మి, కుమారుడు నవీన్, కుమార్తె పూజిత తమ కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయి తీవ్ర విషాదంలో ఉన్నా దుఃఖాన్ని దిగమింగుకొని మరో వ్యక్తి జీవితంలో వెలుగులు నింపడం కోసం మృతుని నేత్రాలను దానం చేసి మానవత్వం చాటుకున్నారు.

నిమజ్జనానికి వెళ్తుండగా అపశ్రుతి

నిమజ్జనానికి వెళ్తుండగా అపశ్రుతి

నిమజ్జనానికి వెళ్తుండగా అపశ్రుతి