
లక్ష్యానికి చేరువలో విద్యుదుత్పత్తి
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలవిద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా ఈ ఏడాది రికార్డుస్థాయిలో విద్యుదుత్పత్తి పరుగులు పెడుతుంది. జలవిద్యుత్ ప్రాజెక్టులు ప్రారంభమైనప్పటి నుంచి మే నెలలోనే విద్యుదుత్పత్తి ప్రారంభించి రికార్డు సృష్టించారు. ఈ ఏడాది సెప్టెంబర్ ఒకటో తేదీ నాటికి 565 మిలియన్ యూనిట్లను సాధించారు. కాగా, ఈ ఏడాది 2025–26 సంవత్సరానికిగాను 610 ఎంయూ టార్గెట్ ఉంది. ఎగువ కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు భారీస్థాయిలో కురుస్తుండడంతో నారాయణపూర్, ఆల్మట్టి ప్రాజెక్టుల నుంచి జూరాలకు వరదనీరు చేరుతుండడంతో విద్యుదుత్పత్తి లక్ష్యానికి చేరువలో ఉంది. సోమవారం 12 యూనిట్ల ద్వారా ఉత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు. ఈ మేరకు ఎగువలో 6యూనిట్ల ద్వారా 234 మెగావాట్లు, 269.017 ఎంయూ, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు, 296.310 ఎంయూ ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు.