
గొప్ప పోరాట యోధుడు.. సురవరం
● సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు
చాడ వెంకట్‌రెడ్డి
● ఆయన ఆశయ సాధనకు ప్రభుత్వం కృషి : మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్
● సురవరం సుధాకర్‌రెడ్డి స్వగ్రామం కంచుపాడులో సంస్మరణ సభ
● నివాళులర్పించినపలు పార్టీల నాయకులు
ఉండవెల్లి: గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించి, నింగికెగిసిన నిస్ప్రుహుడు, తెలంగాణ పోరాట యోధుడు సీపీఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి అని ఆ పార్టీ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం ఉండవెల్లి మండలం కంచుపాడు గ్రామంలోని సురవరం వెంకట్రామిరెడ్డి విజ్ఞాన కేంద్రంలో సురవరం సుధాకర్‌రెడ్డి సంస్మరణ సభను ఉమ్మడి జిల్లా సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చాడా వెంకట్‌రెడ్డితోపాటు మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ, మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సంపత్‌కుమార్, అబ్రహం తదితరులు హాజరయ్యారు. ముందుగా సురవరం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చాడా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. సురవరం సుధాకర్‌రెడ్డి జన్మభూమిని, కన్నతల్లిని మరువలేదని, సొంత గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని, గ్రామీణ స్థాయి నుంచి జాతీయ స్థాయిలో సామాన్యుడి సమస్యలపై గళం విప్పాడని కొనియాడారు. దేశంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన సమయంలో.. దేశానికి ప్రమాదం పొంచి ఉందని, మతోన్మాద, నియంతృత్వ పాలన సాగిస్తారని ముందే హెచ్చరించారని, అలాగే జరిగిందన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి, పోరాటానికి వామపక్షాలు ఒకే వేదిక మీదికి రావాలన్నారు.
ఆయన పేరు చరిత్రలో నిలిచేలా చేస్తాం : సంపత్‌కుమార్
సురవరం సుధాకర్‌రెడ్డి ఆశయ సాధనకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, ఆయన పేరును చరిత్రలో నిలిచేలా చేస్తామని మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అన్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన సంస్మరణసభలో సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి కంచుపాడులోని పలు సమస్యలను సురవరం సుధాకర్‌రెడ్డి భార్య విజయలక్ష్మి తీసుకురాగా 24 గంటల్లో ఆయా పనులు మంజూరు చేశారన్నారు. గ్రామంలోని యూపీఎస్‌ను హైస్కూల్‌గా అప్‌గ్రేడ్ చేస్తామని, రూ.కోటితో భవనం, హాస్టల్ నిర్మిస్తామని అన్నారు. సురవరం ఆశయ సాధన కోసం కృషిచేస్తున్న ఐదుగురికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని, జాతీయ రహదారి నుంచి కంచుపాడుకు బీటీరోడ్డుకు రూ.3 కోట్లు మంజూరు చేశామన్నారు. ఈ అభివృద్ధి పనులకు సంబంధించి ప్రొసీడింగ్ కాపీలను ఈసందర్భంగా విజయలక్ష్మికి అందజేశారు.