
హైవేపై ప్రమాద ఘంటికలు
జాతీయ రహదారిపై పెరుగుతున్న మరణాలు
మహబూబ్‌నగర్ క్రైం: ఉమ్మడి జిల్లాలోని జాతీయ రహదారి–44పై ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల మధ్యలో రోడ్డు ప్రమాదాల సంఖ్య రెట్టింపు అవుతున్నాయి. ప్రమాదాల్లో మొదటి స్థానంలో కార్లు ఉంటే ఆ తర్వాత బస్సులు, ద్విచక్ర వాహనాలు ఉంటున్నాయి. వర్షంలో డ్రైవింగ్, నిద్రమత్తు, ఓవర్ స్పీడ్ వంటి మూడు అంశాలు రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. అయితే ఆయా ప్రమాదాల్లో 70 శాతానికిపైగా యువకులే మృత్యువాతపడుతున్నారు. నాలుగు వరుసల రహదారి వెంట వేసిన అనుబంధ, ఇతర అంతర్గత రోడ్లలో నిబంధనలు పాటించకపోవడంతో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎలాంటి రోడ్డునైనా సరే ప్రతి రెండేళ్లకోసారి మరమ్మతు చేయించాల్సి ఉన్నా ఆ దిశగా ఎవరూ పట్టించుకోవడం లేదు. అద్దంలా మెరవాల్సిన నాలుగు లైన్ల రోడ్లు చాలా చోట్ల గుంతలు, ప్యాచ్‌లు, ఎగుడు దిగుడుగా ఉంటూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. మరోవైపు జాతీయ రహదారి–167పై కూడా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రధానంగా ఈ రోడ్డుపై జడ్చర్ల కల్వకుర్తి మధ్యలో, మహబూబ్‌నగర్ నుంచి దేవరకద్ర మధ్యలో ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుంది.
సూచనలు చేస్తున్నాం..
జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగిన ప్రతి సంఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్నాం. రోడ్డులో ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఇంజినీర్, జాతీయ రహదారి అధికారులకు మరమ్మతు కోసం సూచనలు చేస్తున్నాం. ట్రాఫిక్ నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నాం. ప్రధానంగా జాతీయ రహదారిపై ఉన్న గ్రామాల దగ్గర రోడ్డు దాటుతున్న వాకర్స్ వల్ల పెద్ద పెద్ద వాహనాలకు ప్రమాదాలు జరుగుతున్నాయి. వాకర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి.
– వెంకటేశ్వర్లు, డీఎస్పీ, మహబూబ్‌నగర్
అవగాహన కల్పిస్తాం..
వాహనాలను నడిపేటప్పుడు వివిధ సమస్యలు, ఆలోచనలు పక్కనబెట్టి ఏకాగ్రతగా నడిపితే చాలా వరకు ప్రమాదాలను తగ్గించవచ్చు. ముఖ్యంగా క్రాసింగ్, మూలమలుపుల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలి. మా శాఖ తరుపున పోలీస్, ఆర్టీసీ అధికారులతో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ట్రాఫిక్ నిబంధనలపై ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దీని కోసం పోలీసులు, ఆర్టీఏ ఇతర శాఖలను కలుపుకొని ప్రయాణికులకు అవగాహన కల్పిస్తాం.
– కిషన్, డీటీసీ, మహబూబ్‌నగర్
మూడేళ్ల వ్యవధిలో 670 మంది మృత్యువాత
క్షతగాత్రులుగా మరో 1,243 మంది వాహనదారులు
రాత్రి 11 నుంచి ఉదయం 6 గంటల మధ్యలోనే అత్యధిక ఘటనలు
హైవే–44పై 29 బ్లాక్ స్పాట్స్ గుర్తింపు
టాప్‌లో జడ్చర్ల..

హైవేపై ప్రమాద ఘంటికలు