
పకడ్బందీగా సీఎం పర్యటన బందోబస్తు ఏర్పాట్లు
మహబూబ్‌నగర్ క్రైం/ అడ్డాకుల: మూసాపేట మండలం వేముల గ్రామ సమీపంలో బుధవారం ఎస్‌జీడీ ఫార్మా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 2వ యూనిట్ ప్రారంభ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతున్న సందర్భంగా ఎస్పీ జానకి సోమవారం హెలీప్యాడ్, సమావేశ స్థలాల దగ్గర నిర్వహించే బందోబస్తును పరిశీలించారు. వీఐపీల రాకపోకలతోపాటు పార్కింగ్ స్థలాలను తనిఖీ చేశారు. సీఎం పర్యటనకు అనుగుణంగా వీఐపీ రాకపోకలు, ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎన్‌బీ రత్నం, ఆర్‌అండ్‌బీ అధికారి సంధ్య, భూత్పూర్ సీఐ రామకృష్ణ, ఎస్‌బీ సీఐ వెంకటేష్, మూసాపేట ఎస్‌ఐ వేణు తదితరులు పాల్గొన్నారు.
● సీఎం పర్యటన ఏర్పాట్లను సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు. హెలీప్యాడ్ కోసం జానంపేట శివారులోని విభా సీడ్స్ కంపెనీ వద్ద స్థలాన్ని పరిశీలించారు. అక్కడ అనుకూలంగా లేకపోవడంతో ఎస్‌జీడీ ఫార్మా ముందున్న వెంచర్ వద్ద హెలీప్యాడ్ ఏర్పాట్ల కోసం స్థలాన్ని పరిశీలించారు. భూత్పూర్ సీఐ రామకృష్ణ, ఆర్‌అండ్‌బీ డీఈ సంధ్యతో ఏర్పాట్ల గురించి ఎమ్మెల్యే చర్చించారు. పరిశ్రమ వద్ద జరిగే కార్యక్రమం గురించి కంపెనీ ప్రతినిధులతో మాట్లాడారు. ఇదిలా ఉండగా ఎస్‌జీడీ ఫార్మా వద్ద ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత మూసాపేటలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమంలో సీఎం పాల్గొనాల్సి ఉండగా అనివార్య కారణాలతో వాయిదా పడినట్లు తెలిసింది. ఎస్‌జీడీ ఫార్మా వద్ద ప్రారంభోత్సవంలో పాల్గొని అక్కడి నుంచే తిరిగి సీఎం వెళ్లిపోనున్నారు.