
లొసుగులను తప్పించేందుకే సీబీఐకి అప్పగింత
పాలమూరు: కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలు లోపాయికారి ఒప్పందంలో భాగంగానే కాళేశ్వరంపై సీబీఐకి అప్పగించడానికి సిద్ధమయ్యాయని ఎంపీ డీకే అరుణ అన్నారు. జిల్లాకేంద్రంలోని పద్మావతికాలనీలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. 19 నెలలు కాలయాపన చేసి ఇప్పుడు సీబీఐకి ఇస్తున్నానని చెప్పడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. కాళేశ్వరంలో ఉన్న లొసుగులను గుర్తించి వాటన్నింటిని తప్పించడానికే సీబీఐని తెరముందుకు తెస్తున్నారన్నారు. కాళేశ్వరంపై విచారణ చేయడానికి సీబీఐకి అప్పగించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో సహకరిస్తుందో తెలియదని, ఇదంతా లోపాయికారి ఒప్పందంలో భాగమే తప్పా వేరే ఏమీ లేదన్నారు. బీజేపీ మొదటి నుంచి కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసిందని గుర్తుచేశారు. ఎలాంటి రాజకీయాల కోసం కవిత డైలాగ్‌లు చెబుతుందో తెలియదు కానీ కాళేశ్వరంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల అందరి పాత్ర ఉందని మనం భావించాలన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పద్మజారెడ్డి, పాండురంగారెడ్డి, అంజయ్య, జయశ్రీ పాల్గొన్నారు.