
జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలు
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లాలో శాంతిభద్రతల దృష్ట్యా, ప్రశాంతమైన వాతావరణం కల్పించడంలో భాగంగా సోమవారం నుంచి ఈ నెల 30 వరకు జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ 1861 అమల్లో ఉంటుందని ఎస్పీ జానకి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్న క్రమంలో డీఎస్పీ లేదా ఇతర పోలీస్ ఉన్నతాధికారుల అనుమతి లేకుండా ఎలాంటి పబ్లిక్ సమావేశాలు, ర్యాలీలు, ధర్నాలు చేయరాదన్నారు. కత్తులు, తుపాకులు, పేలుడు పదార్థాలు, నేరానికి పాల్పడే ఎలాంటి ఆయుధాలు వాడరాదని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. లౌడ్ స్పీకర్లు, డీజేలు నిషేధించడం జరిగిందని, ఈ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ 1861 కింద శిక్షార్హులని తెలిపారు.
10 నుంచి శిక్షణ
మహబూబ్‌నగర్ క్రీడలు: జిల్లాకేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో ఈ నెల 10వ తేదీ నుంచి 18వ బ్యాచ్ శిక్షణ ప్రారంభిస్తున్నట్లు డీవైఎస్‌ఓ శ్రీనివాస్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి పాస్ లేదా ఫెయిలైన యువతకు మూడు నెలలపాటు ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెట్ తయారీ, బ్యూటీషియన్, కంప్యూటర్ కోర్సు (ఎంఎస్ ఆఫీస్), రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషన్, మొబైల్ సర్వీసింగ్, రిపేరుపై శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. 7వ తరగతి పాసైన వారికి జర్దోసి, మగ్గం, ఎలక్ట్రిషియన్ కోర్సుల్లో శిక్షణ ఉంటుందన్నారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్ సెట్విన్ వారిచే సర్టిఫికెట్ అందజేస్తామన్నారు. ఆసక్తిగల వారు పాత డీఈఓ కార్యాలయంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో ఈనెల 9 వరకు దరఖాస్తులు అందజేయాలని కోరారు. దరఖాస్తు వెంట విద్యార్హత, ఆధార్, పాస్‌పోర్టు సైజ్ ఫొటోతో జత చేయాలన్నారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం చారిత్రాత్మకం
స్టేషన్ మహబూబ్‌నగర్: బీసీల 42 శాతం రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందడం చారిత్రాత్మకమని డీసీసీ అధ్యక్షుడు, దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో కులగణన చేపట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. దాని ప్రకారం అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్ల బిల్లు పాస్ చేయించామన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందడంపై సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రివర్గానికి, టీపీసీసీ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు.
రేపు మూసాపేటకు సీఎం రాక
మూసాపేట మండలానికి సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం వస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. వేముల శివారులోని ఎస్‌జీడీ ఫార్మా వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన రెండో యూనిట్‌ను ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేయనున్నట్లు వెల్లడించారు. యూరియా కొరతపై బీఆర్‌ఎస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. యూరియా కోసం రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని కోరారు. సమావేశంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి సంజీవ్ ముదిరాజ్, టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రామారావు, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, నాయకులు ఎన్‌పీ వెంకటేశ్, ఆనంద్‌గౌడ్, సీజే బెనహర్, ఆంజనేయులు, అరవింద్‌రెడ్డి, సాయిబాబా, ఫయాజ్, అజ్మత్‌అలీ పాల్గొన్నారు.