
ట్రాప్ సీసీ కెమెరాకు చిక్కిన చిరుత జాడ
మహబూబ్‌నగర్ న్యూటౌన్: మూడు వారాలుగా మహబూబ్‌నగర్ పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న చిరుత ట్రాప్ సీసీ కెమెరాకు చిక్కింది. ఈనెల 22న సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఫైర్ స్టేషన్ ఎదురుగా ఉన్న టీడీ గుట్ట గుండుపై కనిపించడంతో స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది చిరుత కనిపించిన చోటుకు చేరుకొని సెర్చ్ ఆపరేషన్ కొనసాగించారు. అటవీశాఖ సీఎఫ్‌ఓ రాములు, డీఎఫ్‌ఓ సత్యనారాయణలు పరిస్థితిని సమీక్షించి సెర్చ్ బృందాలను అప్రమత్తం చేశారు. ముందుగానే గుట్టపై అమర్చిన ట్రాప్ కెమెరాలకు అదే రోజు సాయంత్రం 6.50 గంటలకు గుట్టపై నుంచి డంపింగ్ యార్డు వైపు వెళుతూ కనిపించింది. దీంతో అటవీశాఖ అధికారులు సెర్చ్ బృందాలను అలర్ట్ చేసి బుధవారం ఉదయం జేసీబీల సాయంతో బోన్‌లను గుట్టపైకి మార్చి.. మరిన్ని ట్రాప్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డ్ వైపు వెళ్లిన చిరుత నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారి దాటే అవకాశం లేనందున తిరిగి గుట్టపైనే సంచరిస్తున్నట్లు అటవీశాఖ బృందాలు అంచనా వేస్తున్నాయి. త్వరలో చిరుతను పట్టుకొని తీరుతామని పేర్కొంటున్నారు. తిరుమలదేవుని గుట్ట, గుర్రం గట్టులపై చిరుత సంచరిస్తుండడంతో పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పటికప్పుడు పోలీసు, అటవీ శాఖ బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తూనే ఉన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తిరుమల దేవునిగుట్ట, గుర్రంగట్టు, వీరన్నపేట, కోయిలకొండ క్రాస్‌రోడ్డు ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ భయానికి గురికాకుండా సూచనలు చేస్తూనే ఉన్నారు. సెర్చ్ బృందాలకు సవాల్ విసురుతూ బోన్‌లో చిక్కకుండా చిరుత తప్పించుకొని తిరుగుతుంది.

ట్రాప్ సీసీ కెమెరాకు చిక్కిన చిరుత జాడ