
ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిష్కరించాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: ఎస్సీ, ఎస్టీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో జిల్లా ఎస్సీ, ఎస్లీ విజిలెన్స్–మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సభ్యుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. భూమి హక్కులకు సంబంధించిన సమస్యల పరిష్కారం, విద్యార్థులకు స్కాలర్‌షిప్ మంజూరు, కార్పొరేట్ పథకాల్లో పరిమిత సీట్లు కేటాయించాల్సిందేనన్నారు. వసతి గృహాలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులకు పౌష్టికాహారం, పరిశుభ్రత, తాగునీటి, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తామన్నారు. అనంతరం ఎస్పీ డి.జానకి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు. అంతకుముందు అంబేడ్కర్, సంత్ సేవాలాల్ మహరాజ్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ ఎ.నరసింహారెడ్డి, జెడ్పీ సీఈఓ వెంకట్‌రెడ్డి, ఎస్సీ అభివృద్ధి శాఖ డీడీ సునీత, మహిళా–శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి జరీనాబేగం, ఏఎస్‌డబ్ల్యూఓలు సుదర్శన్, కన్యాకుమారి తదితరులు పాల్గొన్నారు.
యూరియా పంపిణీలో అక్రమాలను సహించం
హన్వాడ: రైతులకు యూరియా పంపిణీలో అక్రమాలకు పాల్పడితే సహించేదిలేదని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. హన్వాడలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొనసాగతున్న యూరియా విక్రయ కేంద్రాన్ని బుధవారం జిల్లా ఆకస్మికంగా తనిఖీ చేశారు. యూరియా కోసం వచ్చే రైతులకు ఆధార్‌కార్డు ప్రకారం రెండు బస్తాలకు మించి అదనంగా ఇవ్వరాదని సూచించారు. అయితే పలువురు రైతులు ఇష్టారీతిగా యూరియాను తీసుకెళ్లడాన్ని గమనించిన కలెక్టర్.. పీఏసీఎస్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూరియా కోసం వచ్చిన రైతుల బయోమెట్రిక్ విధానాన్ని కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఆమె వెంట ఏడీఏ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశం
జిల్లా విజిలెన్స్–మానిటరింగ్ కమిటీ సమావేశం