
స్థానిక సంస్థల్లో బీఆర్‌ఎస్‌దే విజయం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): వచ్చే స్థానిక సంస్థల్లో బీఆర్‌ఎస్ పార్టీదే విజయమని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాకు చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి అయితే సంతోషమే కానీ జిల్లాకు ఆయన చేసిందేమి లేదని మండిపడ్డారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ 90 శాతం పూర్తయిందని, మరో పదిశాతం పనులు పూర్తి చేస్తే జిల్లాకు ప్రయోజనం కలుగుతుందన్నారు. ‘తెలంగాణ కోసం పోరాటం చేసినం. జైళ్లకు పోయినం. పదేండ్లు తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేసినం. కానీ ముఖ్యమంత్రి ఏం అభివృద్ధి చేయకుండా మాట్లాడితే ఎవరు పడరు.’ అని తెలిపారు. జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలందరూ ఐక్యంగా పని చేసి జిల్లా అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పొంతన లేని సమాధానం చెబుతోందని విమర్శించారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతున్నారని.. మరికొందరు ఆర్డినెన్సు ద్వారా రిజర్వేషన్ అమలు చేస్తామని అంటూ గందరగోళం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. విద్య, ఉపాధి రంగాల్లో కూడా రిజర్వేషన్ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌తో ఎన్నికలు నిర్వహించాలన్నారు. కేసీఆర్‌ను తిడితే ప్రజలు మెచ్చుకుంటారని అనుకోవద్దని, ముందు సీఎం అభివృద్ధిపైన దృష్టి పెట్టాలన్నారు. ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన ప్రభుత్వంలో కనిపించడం లేదన్నారు. డబ్బులు తీసుకొని ఇందిరమ్మ ఇళ్లను ఇస్తున్నారని ఆరోపించారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు మల్లు దేవేందర్‌రెడ్డి నాయకులు రాజేశ్వర్ గౌడ్, గంజి వెంకన్న, శివరాజ్, సుధాశ్రీ, శ్రీకాంత్‌గౌడ్ పాల్గొన్నారు.
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలి
మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్