
దేశంలోనే మహాలక్ష్మి పథకం గొప్ప విప్లవం
స్టేషన్ మహబూబ్‌నగర్: రాష్ట్రంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన మహలక్ష్మి పథకం దేశంలోనే ఒక గొప్ప విప్లవం అని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జిల్లాకేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సంబరాల కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ఆలోచన చేసి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించినట్లు తెలిపారు. ఒక్క ఏడాదిలోనే మహబూబ్‌నగర్‌కు 48 కొత్త బస్సులు కేటాయించారని, వచ్చే ఏడాది మరో 48 బస్సులు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఈ పథకం ప్రారంభమైన వెంటనే బీఆర్‌ఎస్ నాయకులు కడుపుమంటతో ఇష్టానుసారంగా మాట్లాడినట్లు తెలిపారు. మహిళల అభ్యున్నతి కోసం ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. మహిళలే మాకు శక్తి, ధైర్యం అని, మీ ఆశీర్వాదం మాకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో వ్యాసరచన, చిత్రలేఖనం పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులు రాఘవి, భాగ్యలక్ష్మి, శిరీష, అయేషాబేగం, ప్రవళికలకు బహుమతులు అందజేశారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో ఉన్న గ్రంథాలయాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బెక్కరి అనిత, వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్‌గౌడ్, ఇన్‌చార్జి ఆర్‌ఎం కవిత, డిపో మేనేజర్ సుజాత, నాయకులు సిరాజ్‌ఖాద్రీ, సీజే బెనహర్, అజ్మత్‌అలీ, ఖాజా పాష, అంజద్, రాషెద్‌ఖాన్, సంజీవరెడ్డి పాల్గొన్నారు.