మోడల్‌ స్కూల్‌.. కంపు కంపు | - | Sakshi
Sakshi News home page

మోడల్‌ స్కూల్‌.. కంపు కంపు

Jul 23 2025 5:54 AM | Updated on Jul 23 2025 5:54 AM

మోడల్‌ స్కూల్‌.. కంపు కంపు

మోడల్‌ స్కూల్‌.. కంపు కంపు

దుర్గంధ భరితంగా మారిన బాత్‌రూంలు

పాఠశాల గదుల్లోకి చేరుతున్న మురుగు

నాలుగు రోజులుగా స్నానం చేయని హాస్టల్‌ విద్యార్థినులు

నీటి లీకేజీలతో చెమ్మగిల్లుతున్న గోడలు

కన్నెత్తి చూడని అధికారులు

మరమ్మతు చేయిస్తాం..

మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌లో మరుగుదొడ్లు, వాష్‌రూంలు సరిగ్గా లేక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థినులు మా దృష్టికి తీసుకొచ్చారు. త్వరలోనే మరుగుదొడ్లు, స్నానాల గదులకు మరమ్మతు చేయిస్తాం. విద్యార్థినుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నాం. – గంగమ్మ, కేజీబీవీ ఎస్‌ఓ

ధన్వాడ: వుండల కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ కంపు కడుతోంది. హాస్టల్‌ విద్యార్థినులు కనీసం స్నానం చేయడానికి కూడా వీల్లేని విధంగా బాత్‌రూంలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. విద్యార్థినులు బాత్‌రూంల వైపు వెళ్లలేక నాలుగు రోజులుగా స్నానం చేయడం మానేశారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ధన్వాడ మోడల్‌ స్కూల్‌లో ఇంటర్‌ విద్యార్థినుల కోసం హాస్టల్‌ ఏర్పాటుచేయగా.. మొత్తం 100 మంది విద్యార్థినులు వసతి పొందుతున్నారు. అయితే పాఠశాలలోని బాత్‌రూంలు, మరుగుదొడ్లకు మరమ్మతు చేయించకపోవడంతో శిథిలావస్థకు చేరాయి. వాటి నుంచి నీరు బయటికి వెళ్లడం లేదు. ఎవరైనా బాత్‌రూం, మరుగుదొడ్లను వినియోగిస్తే నీరంతా విద్యార్థినులు ఉండే గదుల్లోకి చేరుతుండటంతో కంపు కొడుతున్నాయి. విద్యార్థినులు హాస్టల్‌ గదుల్లో ఉండలేక.. బయటికి వెళ్లలేక నరకం చూస్తున్నారు. తాగునీటికి సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు విద్యార్థినులు ఆరుబయటే నిద్రించాల్సిన దుస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే, పాఠశాలలోని వాటర్‌ సంపును శుభ్రం చేయించకపోవడంతో కప్పలు, పురుగులు చేరాయి. ఆ నీటితోనే విద్యార్థినులు వినియోగిస్తుండటంతో చర్మ వ్యాధులు ప్రబలుతున్నాయి. హాస్టల్‌లో ఉంటున్న వారిలో దాదాపు 50శాతం మంది విద్యార్థినులు చర్మవ్యాధుల బారిన పడ్డారు. కాగా, విద్యార్థినులు తమ ఇబ్బందులను పాఠశాల ప్రిన్సిపాల్‌కు తెలియజేస్తే.. హాస్టల్‌ నిర్వహణ మొత్తం కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేకాధికారి చూస్తున్నారని.. అక్కడికి వెళ్లి సమస్యలను పరిష్కరించుకోవాలని చెబుతున్నారని విద్యార్థినులు వాపోతున్నారు.

మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌లో సరైన వసతులు లేక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదు. అధికారుల తీరును నిరసిస్తూ మంగళవారం హాస్టల్‌ ఎదుట విద్యార్థినులు బైఠాయించి ఆందోళనకు దిగారు. పాఠశాలలో నీటి లీకేజీల కారణంగా గోడలు చెమ్మగిల్లుతున్నాయి. ఫలితంగా విద్యుత్‌ సరఫరా అయి షాక్‌ కొడుతున్నాయి. విద్యార్థినులు నిద్రించే మంచాలు ఇనుపవి కావడంతో షాక్‌కు గురవుతున్నట్లు పలువురు ఆవేదన వ్యక్తంచేశారు. మూత్రశాలలు, మరుగుదొడ్లకు మరమ్మతు చేయించకపోవడంతో వినియోగించలేని దుస్థితి నెలకొందని వాపోతున్నారు. ఇప్పటికై నా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు.

హాస్టల్‌ ఎదుట బైఠాయించి నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement