
జూరాలకు మళ్లీ పెరిగిన వరద
8 క్రస్టు గేట్ల ఎత్తివేత..
దిగువకు నీటి విడుదల
ధరూరు/ రాజోళి/ ఆత్మకూర్: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లో వరద మళ్లీ పెరిగింది. సోమవారం ప్రాజెక్టుకు 67 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. మంగళవారం రాత్రి 9 గంటల వరకు 1.02 లక్షల క్యూసెక్కులకు పెరిగిందని పీజేపీ అధికారులు తెలిపారు. ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు 68 వేల క్యూసెక్కులు రాగా.. రాత్రికి వరద భారీగా పెరిగింది. దీంతో ప్రాజెక్టు 8 క్రస్టు గేట్లను 32,752 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుదుత్పత్తి నిమిత్తం 36,278, కోయిల్‌సాగర్‌కు 315, భీమా లిఫ్టు–1కు 650, నెట్టెపాడుకు 750, ఎడమ కాల్వకు 1,030, కుడి కాల్వకు 645, ఆర్డీఎస్ లింక్ కెనాల్‌కు 150, భీమా లిఫ్టు–2కు 750, సమాంతర కాల్వకు 300 క్యూసెక్కులు వదలగా.. మరో 66 క్యూసెక్కులు ఆవిరైంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.810 టీఎంసీల నీరు నిల్వ ఉంది.
ఆల్మట్టి, నారాయణపూర్‌కు తగ్గిన ఇన్‌ఫ్లో..
జూరాల ఎగువనున్న ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులకు ఇన్‌ఫ్లో తగ్గింది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 49,551 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. ప్రాజెక్టు దిగువనున్న నారాయణపూర్‌కు 51,160 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ ప్రాజెక్టుకు 54,520 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుంది.
సుంకేసులకు 43 వేల క్యూసెక్కులు
సుంకేసుల డ్యాంకు ఎగువ నుంచి మంగళవారం 43 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చింది. దీంతో 9 గేట్లను తెరిచి శ్రీశైలానికి 39,411 క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 1,540 క్యూసెక్కులు వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు.
ముమ్మరంగా విద్యుదుత్పత్తి..
జూరాల దిగువ, ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి ముమ్మరంగా కొనసాగుతుంది. మంగళవారం ఎగువలో 5 యూనిట్ల ద్వార 195 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్ల విద్యుదుత్పత్తి చేపట్టినట్లు ఎస్‌ఈ శ్రీధర్ తెలిపారు.