
ఏడాదిలో 500 పార్లర్ల ఏర్పాటుకు కృషి
జడ్చర్ల టౌన్/ మిడ్జిల్: రాష్ట్రంలో విజయ డెయిరీ ద్వారా ఏడాదిలోపు 500 పార్లర్ల ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర పాడిపరిశ్రమశాఖ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలోని విజయ డెయిరీని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ విజయ డెయిరీ, ఫెడరేషన్ పరిరక్షణకు కఠిన నిర్ణయాలు తప్పవన్నారు. ఇప్పట్లో పాలధర పెంచే యోచన లేదని స్పష్టం చేశారు. రెండేళ్లుగా విజయ డెయిరీ ప్రతినెలా రూ.10 కోట్ల వరకు నష్టంలో ఉండేదని, తాము తీసుకున్న కఠిన నిర్ణయాలతో రెండు నెలలుగా నష్టం రూ.3 కోట్లకు తగ్గించగలిగామన్నారు. ఖర్చులు తగ్గించడంతోపాటు పాల విక్రయాలు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగానే రైతులకు ధరలు తగ్గించామని, సంస్థ లాభాల బాట పట్టాక బోనస్ రూపంలో రైతులకు మేలు చేసే యోచనలో ఉన్నామన్నారు. అలాగే ఆవు పాల సేకరణ తగ్గించి గేదె పాలు సేకరించడం ప్రారంభించాలన్నారు. అందుకు అవసరమైన గేదెలు కొనుగోలు చేసేందుకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పిస్తామన్నారు. జడ్చర్లలో ప్రాసెసింగ్ యూనిట్ ఇప్పట్లో వద్దని, దాని వల్ల ఖర్చులు పెరిగాయని, ముందుగా పాల విక్రయాలు పెంచాలని సూచించారు. అదేవిధంగా జాతీయ రహదారిపై, పట్టణాల్లో పార్లర్ల ఏర్పాటుకు ముందుకు వస్తే అందుకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. ప్రభుత్వ స్థలంలోనే ఏర్పాటు చేయాలని, తాము కలెక్టర్‌కు సైతం తెలియజేస్తామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు రోజు కర్ణాటక ఫెడరేషన్ నుంచి 30 వేల లీటర్ల పాలు వస్తున్నాయని, అక్కడ ధర తక్కువగా ఉండటంతో చాయ్ క్లబ్‌లు, టీ కేఫ్‌లు పెట్టేవారు అక్కడి నుంచి దిగుమతి చేసుకుంటున్నారన్నారు. విజయ పాలు నాణ్యతతో ఉన్నందున మహిళా సమాఖ్యలు ముందుకు వచ్చి పార్లర్లు ఏర్పాటు చేస్తే పాల ఉత్పత్తులు పంపించే బాధ్యత తాము తీసుకుంటామన్నారు. అంతకు ముందు రైతులు, మహిళా సమాఖ్య సభ్యులు పాల ధర పెంచాలని, ప్రాసెసింగ్ యూనిట్ ఇవ్వాలని కోరారు. అనంతరం మిడ్జిల్ మండలంలోని బోయిన్‌పల్లిలో నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో జీఎం మధుసూదన్, జడ్చర్ల మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ జ్యోతి, చిల్లింగ్ సెంటర్ చైర్మన్ రవీందర్‌రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ కవిత, డీడీ శ్రీనివాస్, సీసీ స్వర్ణ, సమాఖ్య అధ్యక్షురాలు శాంతాబాయి, కార్యదర్శి రూప, అరుణ, సత్యమ్మ, మేనేజర్ వెంకట్‌రెడ్డి, ఏపీఎంలు రవికుమార్, మల్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
నెలకు రూ.10 కోట్ల నష్టం నుంచి రూ.3 కోట్లకు తగ్గించాం
రాష్ట్ర పాడిపరిశ్రమశాఖ చైర్మన్ గుత్తా అమిత్‌రెడ్డి