విద్యుదాఘాతంతో రైతు మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో రైతు మృతి

Jul 29 2025 9:05 AM | Updated on Jul 29 2025 9:05 AM

విద్యుదాఘాతంతో రైతు మృతి

విద్యుదాఘాతంతో రైతు మృతి

నాగర్‌కర్నూల్‌ క్రైం: విద్యుదాఘాతానికి గురై రైతుమృతిచెందిన ఘటన మండలంలోని తూడుకుర్తి పరిధి భాగ్యనగర్‌కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై గోవర్ధన్‌ కథనం ప్రకారం.. భాగ్యనగర్‌కాలనీకి చెందిన గుంటిశేఖర్‌ (45) వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం తన పొలంలో బోరుమోటారు ఆన్‌ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులకు సమాచారం అందించడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జనరల్‌ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుడి భార్య కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

కారు, బైక్‌ ఢీ: ఒకరి మృతి

మరికల్‌: కారు బైక్‌ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందిన ఘటన సోమవారం తీలేర్‌ స్టేజీ సమీ పంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకా రం.. ధన్వాడకు చెందిన కావలి భాస్కర్‌(37) ట్రాక్టర్‌కు సంబంధించిన సామగ్రిని తీసుకరావడానికి బైక్‌పై మహబూబ్‌నగర్‌కు వెళ్తుండగా మరికల్‌ మండలం తీలేర్‌ స్టేజీ సమీపంలోకి రాగానే షాద్‌నగర్‌ నుంచి రాయిచూర్‌ వెళ్తున్న కారు ఎదురెదురుగా ఢీకొనడంతో భాస్కర్‌ ఎగిరి ముళ్లపొదల్లో పడి అక్కడిక్కడే మృతిచెందాడు. కారు చెట్టుకు ఢీకొని పల్టీలు కొట్టి నిలిచి పోయింది. కారులో ఉన్న చిన్నారితోపాటు నలుగురు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాము తెలిపారు.

కారు, బైక్‌ ఢీ: యువకుడు మృతి

వనపర్తి రూరల్‌: కారు, బైకు ఢీకొన్న ప్రమాదంలో వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తికి గాయాలైన సంఘటన ఆదివారం అర్ధరాత్రి చిట్యాల శివారులో చోటుచేసుకుంది. వనపర్తి రూరల్‌ ఎస్‌ఐ జలంధర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వనపర్తి పట్టణంలోని పాతబజార్‌కు చెందిన శివ (35) అతని స్నేహితుడు పుట్ట కుర్మయ్య కలిసి జంగమాయిపల్లి నుంచి ఆదివారం అర్ధరాత్రి బైక్‌పై వనపర్తికి వస్తుండగా, మార్గమధ్యలో చిట్యాల శివారులో ఎదురుగా వస్తున్న కారు బైక్‌ను ఢీకొట్టింది. దీంతో బైక్‌పై నుంచి ఇద్దరు కింద పడ్డారు. తీవ్రగాయాలు కావడంతో వెంటనే వారిని వనపర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు శివను హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా కొత్తకోట శివారులో మృతిచెందాడు. పుట్ట కురుమయ్య గాయాలతో వనపర్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై సోమవారం శివ భార్య ఆవల శారద శతమానం ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

తెలకపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ నరేష్‌ వివరాల ప్రకారం.. వంగూరు మండలంలోని ఉల్పర గ్రామానికి చెందిన గున్నమోని శ్రీను(45) తన ద్విచక్ర వాహనంపై అదే గ్రామానికి చెందిన మల్లయ్యతో కలిసి కారువంగ గ్రామానికి చేరుకున్నారు. తిరుగు ప్రయాణంలో గున్నమోని శ్రీను ఒక్కరే తన ద్విచక్రవాహనంపై కారువంగ నుంచి ఉల్పరకు బయలుదేరాడు. కారువంగ గ్రామ సమీపంలో మాదవరెడ్డి పొలం దగ్గర ఉన్న ఎడ్లబండికి ప్రమాదవశాత్తు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. అతని భార్య గున్నమోని భారతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో

వృద్ధురాలి మృతి

అడ్డాకుల: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలి మృతి చెందిన ఘటన మూసాపేట మండలం జానంపేట వద్ద జాతీయ రహదారిపై సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం జానంపేట గ్రామానికి చెందిన బాల కుర్మయ్య, మద్దిగట్ల అంజమ్మ(60) దంపతులు. ఇటీవల అంజమ్మ పుట్టింటికి వెళ్లింది. భర్త అనారోగ్యానికి గురికావడంతో భార్య అంజమ్మ జానంపేటకు బయలుదేరింది. ఆదివారం రాత్రి జానంపేటలో రోడ్డు దాటుతుండగా హైదరాబాద్‌ నుంచి కర్నూల్‌ వైపు వెళ్లే కారు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో అంజమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు పేర్కొన్నారు.

ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

జడ్చర్ల: కొల్లోనిమర్ల తండాకు చెందిన ఇంటర్‌ విద్యార్థిని హర్షిత(16) ఆత్మహత్య చేసుకుంది. సోమవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని తండావాసులు తెలిపారు. కాగా మృతు రాలు జిల్లాకేంద్రంలోని ఓ ప్రభుత్వ గురుకుల కళాశాలలో ఇంటర్‌ ప్రవేశ పరీక్ష రాసినట్లు తెలిసింది. అంతకుముందు మరో రెండు కళాశాలల్లో ప్రవేశపరీక్ష రాసిందని, చదువు ఇష్టం లేకనే ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. కూతురు ఆత్మహత్యతో తల్లిదండ్రులు ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. విద్యార్థిని ఆత్మహత్యపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement