
దొంగల స్వైర విహారం
కల్వకుర్తి రూరల్: పట్టణంలో దొంగలు స్వైర విహారం చేస్తున్నారు. సోమవారం అర్ధరాత్రి పట్టణంలోని గాంధీనగర్ కాలనీలో ఐదు ఇళ్లల్లో చోరీకి పాల్పడ్డారు. చోరీలో దాదాపు 5 తులాల బంగారం, 50 వేల వరకు నగదు అపహరించినట్లు బాధితులు వాపోయారు. తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్‌గా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు బాధితులు తెలిపారు. గాంధీనగర్‌కు చెందిన అనిల్ ఇంట్లో రెండున్నర తులాల బంగారం, రూ.15 వేల నగదు, చంద్రయ్య ఇంట్లో రూ.20 వేల నగదు, బంగారు ఆభరణాలు, కృష్ణయ్య ఇంట్లో రూ.10,000 నగదు, నరసింహారెడ్డి, మైనుద్దీన్ ఇళ్లలో చోరీకి పాల్పడినట్లు తెలిపారు. మంగళవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా తాళం పగులగొట్టి ఉండడాన్ని గమనించిన బాధితులు ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. చోరీ జరిగిన ఇళ్లను సీఐ నాగార్జున, ఎస్‌ఐ మాధవరెడ్డి క్లూస్‌టీంతో కలిసి పరిశీలించారు.