
పాన్‌గల్ కోటలో పులివేట వీరగల్లు ప్రతిమ
పాన్‌గల్: వనపర్తి జిల్లా పాన్‌గల్ మండల కేంద్రంలోని ఖిల్లా కోటకు చాలా ప్రాచీన చరిత్ర ఉంది. కోటలో అనేక కట్టడాలు, ఫిరంగులతో పాటు ఎన్నో శిల్పాలు, వీరగల్లు విగ్రహాలున్నాయి. కోటలోకి వెళ్తుంటే ముళ్ల గవినిగా పిలవబడే ప్రదేశం వద్ద దాదాపు నాలుగు అడుగులున్న పులివేట వీరగల్లు ప్రతిమను కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధన సభ్యులు బైరోజపు చంద్రశేఖర్, బైరోజు శ్యాంసుందర్ ఆదివారం గుర్తించారు. ఈ దుర్గం వద్ద కనిపించే పులి, పందివేట వీరగల్లులు ప్రత్యేక ఆకర్షణ. పులులు, అడవి పందుల నుంచి ప్రజలను కాపాడిన వీరుల సాహసాన్ని గుర్తుచేసే వీరగల్లులు, ఊరి పొలిమేరల్లో ప్రజల అభిమానానికి నిదర్శనంగా నిలిచాయి. రాతిపై వీరగల్లు ప్రతిమలో కుడివైపు సిగ, తలపై పాగా, మెడలో కంటె, వీరకాసెతో కనిపిస్తున్న వీరుడు రెండు చేతుల బల్లెంతో పులిని చంపుతున్న దృశ్యం ఒక రాతిపలక మీద ఉపశిల్పంగా చెక్కబడింది. ఈ వీరగల్లు ప్రతిమ క్రీ.శ.13, 14వ శతాబ్దాల నాటి శైలిలో చెక్కబడి ఉంది. అరుదుగా కనిపించే, ప్రతిష్ఠించే ఈ పులివేట వీరగల్లు ప్రతిమ మరొకటి ఇదే మండలంలోని బుసిరెడ్డిపల్లి కూడా ఉందన్నారు. ఇవి అరుదైన వీరగల్లులు అని ఇలాంటివి తెలంగాణలో నిజామాబాద్, భువనగిరి, ఖమ్మం, వరంగల్, నిర్మల్ జిల్లాలో కూడా ఉన్నాయని వారు తెలిపారు. ఇప్పుడు వనపర్తి జిల్లాలో ఈ పులివేట వీరగల్లు ఉండడం ఇక్కడి వీరుల పరాక్రమాన్ని తెలియజేస్తున్నాయని వివరించారు. వీటిని భద్రపరచడమో లేదా ఏదేని మ్యూజియానికి చేర్చాలని స్థానిక ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. అలాగే పాన్‌గల్ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే ప్రాంతీయ ప్రగతికి దోహదం చేస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.