
రద్దీ ఏరియాల్లో నిఘా పెంచుతాం
మహబూబ్‌నగర్ క్రైం: జిల్లా కేంద్రంలోని రద్దీ ఏరియాల్లో నిఘా పెంచుతామని ఎస్‌పీ జానకి పేర్కొన్నారు. శనివారం అర్ధరాత్రి ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్ వద్ద ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. మొదట ఆర్టీసీ బస్టాండ్‌కు వెళ్లిన ఎస్పీ అక్కడ వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన ప్రయాణికులు నిద్రిస్తున్నండగా.. వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొంతమంది అనుమానితులు కన్పిస్తే వారిని అదుపులోకి తీసుకుని ఫింగర్ ప్రింట్ డివైస్ సహాయంతో వారి వివరాలు పరిశీలించారు. అనంతరం రైల్వేస్టేషన్‌లో కూడా పలు రైళ్లకోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల లగేజ్‌తోపాటు వారి వివరాలను ఆరా తీశారు. అదేవిధంగా అనుమానితుల ఫింగర్ ప్రింట్‌లు సేకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. బస్టాండ్, రైల్వేస్టేషన్‌లో అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులపై నిత్యం నిఘా పెట్టడంతో నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఫింగర్ డివైస్ సహాయంతో వ్యక్తుల వేలిముద్రలు క్షుణ్ణంగా పరిశీలించి నేర చరిత్ర ఉంటే అదుపులోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ తనిఖీలు భవిష్యత్‌లో మరింత విస్తృతం చేస్తామని, పోలీసుల నిఘా చర్యలతో నేరాల తగ్గుముఖం పట్టాయని తెలిపారు. తనిఖీలో డీసీఆర్‌బీ డీఎస్పీ రమణారెడ్డి, ఇతర పోలీసులు పాల్గొన్నారు.
పాలమూరు ఎస్‌పీ జానకి
పట్టణంలో అర్ధరాత్రి విస్తృత తనిఖీలు