
సజ్జ పంట సాగు లాభదాయకం
అలంపూర్: రైతులు ఏక పంట సాగు చేస్తూ తరుచూ నష్టాలు చవిచూస్తున్నారు. అలా కాకుండా చిరుధాన్యాల పంటలపై దృష్టిసారిస్తే నష్టాల బారి నుంచి బయటపడొచ్చని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సక్రియానాయక్ రైతులకు సూచించారు. అందులోనూ సజ్జ పంట సాగు లాభదాయకమని తెలిపారు. ఎర్ర నేలల్లో సజ్జ పంట సాగు చేస్తే అధిక దిగుబడి వస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో కొంత విస్తీర్ణంలో సాగు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
సజ్జ ప్రాముఖ్యత
సజ్జ పంటను వర్షాధార, ఉష్ణ మండల ప్రాంతాల్లోనూ, భూసారం, నీటి నిల్వ శక్తి తక్కువ ఉన్న భూములలోనూ సాగు చేసుకోవచ్చు. సజ్జ అత్యధిక పోషక విలువలు కలిగి ఉంటుంది. వీటి నుంచి తయారు చేసిన జావ, గంజి తాగడం ద్వారా రక్తహీనత నుంచి బయటపడడంతో పాటు కంటిచూపునకు మేలు చేస్తుంది. 100 గ్రాముల సజ్జ గింజల నుంచి 361 కిలోల కేలరీల శక్తి లభిస్తోంది.
సాగు ఇలా.. సజ్జ సాగుకు తేలిక నుంచి మధ్య రకం ఎర్రనేలలు, నీరు ఇంకే భూములు అనుకూలం. ముందుగా ఎకరాకు నాలుగు టన్నుల పశువుల ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. ఎకరాకు 1.6 కిలోల విత్తనం అవసరం. విత్తే ముందు 2 శాతం (20 గ్రా/లీటర్ నీటికి) ఉప్పు ద్రావణం ఉంచాలి. ఈ విధంగా చేయడం వలన ఎర్గాట్ అనే శీలింధ్ర అవశేషాలను వేరు చేయగలం. ఆరిన విత్తనానికి కిలోకు 3 గ్రాముల థైరామ్ లేదా ఆప్రాన్ 35 ఎస్‌డీ లేదా కాప్లాన్ మందును కలిపి విత్తన శుద్ధి చేసుకోవాలి. సాళ్ల మద్య 45 సెం.మీ, మొక్కల మధ్య 12 నుంచి 15 సెం.మీ దూరంలో గొర్రుతో విత్తుకోవాలి.
ఎరువుల వాడకం
వర్షాధారపు పంటకై తే 50 కేజీల యూరియా, 75 కేజీల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 15 కేజీల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ వేయాలి. మొత్తం యూరియాను రెండు భాగాలుగా చేసి విత్తేటప్పుడు సగ భాగం, పైరు మోకాళ్ల ఎత్తులో ఉన్నప్పుడు మిగితా భాగం వేయాలి.
కోత.. కంకులలోని సజ్జల గింజ కింది భాగాన్ని గమనిస్తే చిన్న నల్లని చుక్క కనిపిస్తోంది. మొక్కలోని అధిక భాగం ఆకులు పసుపు వర్ణంలోకి మారి ఎండిపోయినట్లు కనిపిస్తాయి. ఈ దశలో పంటను కోయాలి. పిల్ల కంకుల కంటే ప్రధాన కాండపు కంకి మొదట కోతకు వస్తోంది.
అంతర్ కృషి .. పంట వేసిన మొదటి 30 రోజుల వరకు పొలంలో ఏ విధమైన కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. విత్తిన రెండు వారాల్లోపు ఒత్తు మొక్కలను తీసివేయాలి. 25 నుంచి 30 రోజుల సమయంలో గుంటక లేదా దంతితో అంతర్ కృషి చేయాలి.
మేలేన రకాలు ఇవి: అధిక దిగుబడి ఇచ్చే సూటి రకాలు ఈసీటీసీ 8203, ఈసీఎంవీ 231, రాజ్ 171.
హైబ్రిడ్ రకాలు: హెచ్‌హెచ్‌బీ 67, ఈసీ ఎంహెచ్ 356, ఆర్‌హెచ్‌బీ 121, జీహెచ్‌బీ 538, పీహెచ్‌బీ 3, ఏబీహెచ్ 1.
పాడి–పంట
సస్యరక్షణ
వానాకాలంలో సజ్జ పంటను వెర్రి తేనెబంక తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది. తేనె బంక తెగుళ్ల నివారణకు పూత దశలో మాంకోజెట్ 2.5 గ్రాముల లీటర్ నీటికి లేదా కార్బండిజమ్ ఒక గ్రాము లీటర్ నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.

సజ్జ పంట సాగు లాభదాయకం