
బాలుడి ప్రాణం తీసిన ఈత సరదా..
మిడ్జిల్: సరదాగా ఈతకు వెళ్లిన ఓ బాలుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందిన ఘటన మిడ్జిల్ మండలం వల్లభ్‌రావుపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు వివరాలిలా.. వల్లభ్‌రావుపల్లికి చెందిన జక్క రఘు, యాదమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు నరేష్, సాయి(7) ఉన్నారు. సోమవారం సెలవు దినం కావడంతో అన్నదమ్ములు నరేష్, సాయి కలిసి మధ్యాహ్నం గ్రామ సమీపంలోని దుందుభీ వాగు వద్దకు వెళ్లారు. వాగు సమీపంలో ఇటీవల ఇళ్ల నిర్మాణానికి ఇసుక తరలించడంతో పెద్ద గొయ్యి ఏర్పడింది. దాంట్లో నీరు నిల్వ ఉండడంతో ఇద్దరు ఈత కొట్టేందుకు అందులోకి దిగారు. కాసేపటికి అన్న నరేష్ బయటకు రాగా.. తమ్ముడు సాయి మునిగిపోయాడు. వెంటనే అన్న చుట్టుపక్కల వారికి చెప్పగా వారు వచ్చి నీట మునిగిన బాలుడు సాయిని బయటికి తీశారు. కానీ, అప్పటికే అతడు మృతిచెందాడు. బాలుడు మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఇదిలాఉండగా, అప్పటి వరకు కళ్ల ముందు ఆడుకున్న కుమారుడు కానరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఎస్‌ఐ శివనాగేశ్వర్‌నాయుడును వివరణ కోరగా.. ఈ సంఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
ఉరేసుకొని వ్యక్తి బలవన్మరణం
జడ్చర్ల: ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన జడ్చర్లలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలిలా.. పట్టణంలోని నిమ్మబాయిగడ్డకు చెందిన కుంకుళ్ల లలితమ్మ పెద్ద కుమారడు రామకృష్ణ(38). ఇతనికి జడ్చర్లకు చెందిన మణెమ్మతో గత 13 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. కాగా గత కొన్ని సంవత్సరాలుగా వారు కొత్తగా నిర్మించుకున్న ఇంట్లో ఉండేవారు. అయితే, ఈ నెల 20న తన కుమారుడు రామకృష్ణకు లలితమ్మ ఫోన్ చేయగా.. ఎంతకూ ఎత్తకపోవడంతో ఇంటికి వచ్చి చూసింది. అప్పటికే అతడు ఉరి వేసుకుని కనించాడు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా తన కుమారుడు రామకృష్ణ మృతిపై అనుమానం ఉందని మృతుడి తల్లి లలితమ్మ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆనారోగ్యంతో
మహిళ ఆత్మహత్య
జడ్చర్ల: అనారోగ్యంతో బాధపడుతూ ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన చోటు చేసుకుంది. జడ్చర్ల మండలం బురుగుపల్లికి చెందిన అలవేలు కూతురు స్వప్న(26)ను ఏడేళ్ల క్రితం కొమరబండ గ్రామానికి చెందిన శేఖర్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. కాగా కొన్ని రోజులుగా ఆమె అనారోగ్యంతో బాధపడుతుండగా ఆసుపత్రిలో చూపించేందుకు బూర్గుపల్లికి తీసుకుని వచ్చి తమ ఇంట్లో ఉంచుకున్నట్లు తల్లి అలివేలు తెలిపారు. కాగా ఇక్కడే ఉంటూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండేది. అయితే, ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాము పడుతున్న కష్టం చూిసిన కూతురు ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని, ఈ విషంయలో అనారోగ్యంతో ఉన్న ఆమె తనకు తానుగానే ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసునమోదు చేసినట్లు సీఐ కమలాకర్ తెలిపారు.