
ఉదండాపూర్ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
జడ్చర్ల: ఉదండాపూర్ నిర్వాసితులకు న్యాయం చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, డిసెంబర్ 9లోగా ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని అందిస్తామని కొల్లాపూర్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడం హర్షణీయమని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలో ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి సంబంధించి కనీసంగా సర్వే కూడా పూర్తి చేయలేకపోయారని దుయ్యబట్టారు. కానీ తాము ఇప్పటికే జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించామన్నారు. అదేవిధంగా ప్యాకేజీ పెంపునకు సంబంధించి ప్రభుత్వ పరిశీలనలో ఉందని పేర్కొన్నారు. లక్ష్మారెడ్డి మంత్రిగా పనిచేసి కూడా మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపట్టలేదని, ఎన్నికల ముందు జీఓలు తీసుకొచ్చి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. గత ప్రభుత్వలో విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న లక్ష్మారెడ్డి ఎన్ని సబ్‌స్టేషన్లు తీసుకొచ్చారని ప్రశ్నించారు.
రూ.లక్షలు ఖర్చు చేస్తున్నా..
తమ గ్రామంలో దేవుడి భూమి గురించి మాట్లాడే నైతిక హక్కు మాజీ ఎమ్మెల్యేకు లేదని ధ్వజమెత్తారు. దేవుడి భూమి నుండి వచ్చే ఆదాయమే లేదని, అర్చకులకు సైతం సొంతగా జీతాలు ఇస్తున్నామన్నారు. ఏటా ఉత్సవాలకు సొంతంగా రూ.లక్షలు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కోర్టు ఖర్చులు తామే భరించి 120 ఎకరాల భూమిని కాపాడామని గుర్తుచేశారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
14వ వార్డులోని త్రిషూల్‌నగర్‌లో రూ.1.35 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ పుష్పలత, మార్కెట్ చైర్‌పర్సన్ జ్యోతి, కౌన్సిలర్లు చౌహాన్, రమేశ్, రాజు, నాయకులు నిత్యానందం, అశోక్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీని అందిస్తాం
మాజీ ఎమ్మెల్యే హయాంలోనే దేవుడి భూములు మాయం
ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి