
‘పింఛన్లు పెంచకపోతే సీఎం రాజీనామా చేయాలి’
గద్వాలటౌన్: తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లు పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలలు గడుస్తున్నా పట్టించుకోవడం లేదని, హామీలు అమలు చేయకపోతే సీఎం రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. శనివారం గద్వాలలోని ఓ ప్రైవేటు హాల్‌లో నిర్వహించిన దివ్యాంగులు, చేయూత పింఛన్‌దారుల మహాగర్జన సన్నాహాక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లుగా దివ్యాంగులకు రూ.6వేలు, చేయూతకు రూ.4 వేలు, తీవ్ర వైకల్యం ఉన్న వారికి రూ.15 వేల పింఛన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. హామీలను అమలు చేయడంలో రేవంత్ సర్కార్ విఫలమైందని ధ్వజమెత్తారు. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్‌ఎస్ సైతం పింఛన్ల పెంపు హామీని ప్రశ్నించడం లేదని ఆరోపించారు. ఆరోగ్యశ్రీ, వృద్ధాప్య, వితంతు పింఛన్లు వంటి పథకాల అమలు ఎమ్మార్పీఎస్ పోరాట ఫలితమేనన్నారు. నాలుగైదేళ్లుగా కొత్త దివ్యాంగులకు పింఛన్లు మంజూరు చేలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మార్పీఎస్, దివ్యాంగుల, చేయూత పింఛన్‌దారుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఆగస్టు 13న హైదరాబాద్‌లో మహాగర్జన సభను నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు శంకర్, భీమన్న, రాజు, అశోక్, పరశురాం, కన్నా, మోష, ఆంజనేయులు, బాస్కర్, యల్లప్ప, యాగంటి, వెంకటన్న తదితరులు పాల్గొన్నారు.