
పాత కక్షలతో కత్తితో వ్యక్తిపై దాడి
మరికల్: పాతకక్షలను మనసులో పెట్టుకొని కొబ్బరి బోండాల కత్తితో ఓ వ్యక్తిపై దాడిచేసిన ఘటన శనివారం రాత్రి మరికల్‌లో కలకలం రేపింది. ధన్వాడ ఎస్‌ఐ రాజశేఖర్, మరికల్ ఏఎస్‌ఐ ఎల్లయ్య కథనం ప్రకారం.. ఐదేళ్ల కిందట జరిగిన వివాహేతర సంబంధం కారణంగా బోండాల మల్లేశ్, లంబడి వెంకటేశ్ మధ్యన తగదాలున్నాయి. అప్పట్లో పెద్దల సమక్షంలో పంచాయితీ కూడా నిర్వహించారు. అయితే లంబడి వెంకటేశ్‌పై ఆగ్రహంతో ఉన్న బోండాల మల్లేశ్ శనివారం రాత్రి 8:27 సమయంలో వెంకటేశ్ బైక్‌పై ఇంటికి వెళ్తుండగా రోడ్డు మలుపు వద్ద మాటువేసి ఒక్కసారిగా కొబ్బరి బోండాల కత్తితో దాడిచేయగా.. శరీరం వెనక భాగం, మెడపై తీవ్ర గాయలయ్యయి. పక్కనే టీస్టాల్ వద్ద ఉన్నవారు పరుగెత్తుకుంటూ రావడంతో మల్లేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. వెంటనే బాధితుడిని పోలీస్‌స్టేషన్‌కు తరలించగా దాడికి గురైన వ్యక్తిని పోలీసులు వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అనంతరం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. దాడి వెనుక వివాహేతర సంబంధమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తివివరాలు తెలియాల్సి ఉందని ఏఎస్‌ఐ ఎల్లయ్య తెలిపారు.