
వసూళ్ల పర్వం ఆగేనా..?
జడ్చర్ల: అక్రమ వసూళ్లు, అవినీతి కార్యకలాపాలకు అడ్డాగా పేరొందిన జడ్చర్ల సబ్‌రి జిస్ట్రార్ కార్యాలయం పనితీరుపై ఆదినుంచి అనేక ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. దాదాపు దశాబ్ద కాలంగా ఇక్కడ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నా ఎప్పుడూ ఎక్కడా ఉన్నతాధికారులు స్పందించిన దాఖలాలు లేవు. అంతేగాక ఏసీబీ సైతం కార్యాలయం దరిదాపుల్లోకి వచ్చిన పరిస్థితి చరిత్రలో లేదు. ఇలాంటి క్రమంలో గురువారం ఆకస్మికంగా సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంపై ఏసీబీ దాడులకు ఎగబడడం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ పనిచేసిన వారంతా రూ.కోట్లు కూడబెట్టుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో జడ్చర్ల సబ్‌రిజిస్ట్రార్ సీటుకు ఆ శాఖలో గోల్డెన్ సీటుగా ప్రచారం ఉంది. ఇక్కడికి బదిలీపై రావాలనుకున్నవారు భారీ అంచనాలతోనే వస్తారన్న ప్రచారం ఉంది. రెండు జాతీయ రహదారులతోపాటు విలువైన భూములు, ప్లాట్లు ఉండడమే ఇందుకు కారణంగా పేర్కొంటున్నారు. అయితే గత ప్రభుత్వ హయాంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలను తహసీల్దార్‌కు అప్పగించడంతో కాస్త డిమాండ్ తగ్గింది.
ఉలిక్కి పడిన జడ్చర్ల
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు జరుగుతున్నాయన్న విషయం తెలియగానే ఒక్కసారిగా జడ్చర్ల ఉలిక్కిపడింది. ఇంతకాలానికి ఏసీబీ దృష్టిసారించడం వెనుక ఆంతర్యమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సాధారణ తనిఖీలుగానే సంబంధిత అధికారులు పేర్కొంటున్నా.. ఎవరో బలమైన ఫిర్యాదు చేశారన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఏదీఏమైనా ఏసీబీ తనిఖీలను ప్రజలు స్వాగతిస్తున్నారు.
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో గురువారం అర్ధరాత్రి దాకా కొనసాగిన తనిఖీల నేపథ్యంలో ఏసీబీ దర్యాప్తు నిశితంగా కొనసాగుతుంది. కార్యాలయం కార్యకలాపాలను పరిశీలించేందుకు సీసీ ఫుటేజీలు కీలకంగా మారుతాయని భావించినా అవి కొంతకాలంగా పనిచేయక పోవడం ఇబ్బందిగా మారింది. ఇక తనిఖీల సమయంలో సిబ్బంది ఫోన్లతోపాటు పలువురి డాక్యుమెంట్ రైటర్ల ఫోన్లను స్వాధీనపర్చుకుని ఆన్‌లైన్ లావాదేవీలను పరిశీలిస్తున్నారు. ఓ రైటర్ వద్ద కొంత నగదును స్వాధీన పర్చుకున్న అధికారులు రికార్డులు, డాక్యుమెంట్లను స్వాధీన పర్చుకుని విచారిస్తున్నారు. కార్యాలయం అవినీతి అక్రమాల లావాదేవీలకు సంబంధించి కీలకంగా మారిన ఓ ప్రైవేట్ వ్యక్తి పరారీలో ఉన్నట్లు గుర్తించారు. కాగా జడ్చర్ల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంతోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి లేకుండా పరిపాలన సాగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
జాడలేని డాక్యుమెంట్ రైటర్లు
ఏసీబీ దాడుల నేపథ్యంలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయం ఒక్కసారిగా నిర్మానుశంగా మారింది. డాక్యుమెంట్ రైటర్లు, పైరవీకారులతో నిత్యం రద్దీతో సందడిగా ఉండే కార్యాలయం శుక్రవారం బోసిపోయింది. డాక్యుమెంట్ రైటర్స్ కార్యాలయాలు మూతబడ్డాయి. మచ్చుకు ఒక్క రైటర్ కనిపించక పోవడం విశేషం. కాగా శుక్రవారం ఎస్‌ఆర్‌ఓ సమ్మయ్య, సిబ్బంది యథావిధిగా విధులకు హాజరయ్యారు. తాము నిబంధనలకు అనుగుణంగానే విధులు నిర్వర్తిస్తున్నామని, ఎక్కడా అక్రమాలకు తావివ్వలేదని పేర్కొన్నారు.
నిశితంగా ఏసీబీ దర్యాప్తు
ఏసీబీ దాడులతో నిర్మానుషం
సందడిలేని జడ్చర్ల సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్
మూతబడిన డాక్యుమెంటర్స్ కార్యాలయాలు

వసూళ్ల పర్వం ఆగేనా..?

వసూళ్ల పర్వం ఆగేనా..?