
అల్ట్రాసౌండ్ సేవలకు అవస్థలు
పాలమూరు: మహబూబ్‌నగర్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో రేడియాలజీ విభాగంలో సరిపడా వైద్య సిబ్బంది లేకపోవడంతో రోగులకు నిత్యం అవస్థలు తప్పడం లేదు. ప్రధానంగా అవసరం ఉన్న అల్ట్రా స్కానింగ్‌తో నానా ఇబ్బందులు పడుతున్నారు. నిబంధనల ప్రకారం జనరల్ ఆస్పత్రిలో ఉండే రేడియాలజీ విభాగం 24 గంటలపాటు అందుబాటులో ఉండాలి. కానీ, ఇక్కడ కేవలం 4 గంటలు మాత్రమే రోగులకు అందుబాటులో ఉంటున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు 60 నుంచి 70మంది రోగులకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు పూర్తి చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మళ్లీ ఉదయం 9.30 గంటల వరకు అల్ట్రాసౌండ్ స్కానింగ్ అవసరమైన రోగులు ఉంటే బయట ప్రైవేట్‌కు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.
ఒకే మిషన్‌తో..
ఆస్పత్రిలో మొత్తం 3 స్కానింగ్ మిషన్స్ ఉండగా రెండు పనిచేస్తుండగా మరో మిషన్ మరమ్మతుకు గురైంది. ప్రస్తుతం ఒక్కరే వైద్యుడు ఉండగా మరో మిషన్ ఖాళీగా ఉంటుంది. రేడియాలజీ విభాగంలో ఒక ప్రొఫెసర్ ఉండగా అసోసియేట్ ప్రొఫెసర్ ఖాళీగా ఉంది. మూడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులలో ఇద్దరు వైద్యులు పని ఒత్తిడి తట్టుకోలేక విధులకు హాజరుకావడం లేదు. కేవలం ఒకే ఒక్క అసిస్టెంట్ ప్రొఫెసర్‌తో అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇద్దరూ ఎస్‌ఆర్ ఉంటే దీంట్లో ఒకరు రావడం లేదు. వీరే సీటీ స్కానింగ్, అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయాలి. దీంతో అక్కడ పని చేసే సిబ్బంది పని ఒత్తిడి ఎక్కువగా అవుతుంటే రోగులకు స్కానింగ్ సేవలు సక్రమంగా అందడం లేదు.
● జీజీహెచ్‌లో పడిగాపులు కాస్తున్న రోగులు
● పట్టించుకోని ఉన్నతాధికారులు