
‘తపాలా’లో సాంకేతిక సేవలు
స్టేషన్ మహబూబ్‌నగర్: తపాలాశాఖ నిర్వహణలో నూతన సాంకేతిక సేవలు రానున్నాయి. మెరుగైన, సురక్షితమైన సేవల కోసం తపాలా శాఖలో అధునాతన సాంకేతిక విధానం అమలుకు శ్రీకారం చుడుతున్నారు. తపాలా శాఖ కార్యాలయాల ద్వారా సేవలన్నింటిని ఒకే గొడుగు కింద తెచ్చి అమలు చేయుటకు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఐటీ 2.0 పేరుతో నూతన సాఫ్ట్‌వేర్ రూపొందించారు. ఈ సాఫ్ట్‌వేర్‌లో కార్యకలాపాల డేటా భద్రతను పెంచుతుందని చెబుతున్నారు. అలాగే ఉద్యోగుల పని సామర్థ్యం కూడా పెరగడమే కాకుండా సేవలు మెరుగవుతాయని భావిస్తున్నారు. తపాలా శాఖ తెలంగాణ సర్కిల్ అంతటా ఈనెల 22 నుంచి ఐటి 2.0 అమలు చేయనుంది. ఇప్పటికే కర్ణాటకలో, మన రాష్ట్రంలోని హైదరాబాద్ డివిజన్, తెలంగాణ సర్కిల్‌లోని నల్లగొండ తపాలా డివిజన్లలో అమలు చేస్తున్నారు.
మహబూబ్‌నగర్ డివిజన్ కార్యాలయాలు
మహబూబ్‌నగర్ హెచ్‌ఓ, గద్వాల హెచ్‌ఓ, నాలుగు సబ్ డివిజన్స్ (మహబూబ్‌నగర్ ఈస్ట్ సబ్ డివిజన్, వెస్ట్ సబ్ డివిజన్, నారాయణపేట సబ్ డివిజన్, గద్వాల సబ్ డివిజన్) పరిధిలోగల 368 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో, 42 ఉప తపాలా కార్యాలయాల్లో ఐటీ 2.0 అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే అధికారులు, ఉద్యోగులు, సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు.
రెండు రోజులపాటు..
కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈ నెల 19, 21 తేదీల్లో తపాలా సేవలు నిలిపివేస్తున్నట్లు మహబూబ్‌నగర్ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ విజయజ్యోతి తెలిపారు. ఈ విషయాన్ని వినియోగదారులు, ఖాతాదారులు గమనించి సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ నెల 22 నుంచి నూతన సాంకేతిక పరిజ్ఞానం అమలులోకి వస్తుందని పేర్కొన్నారు.
ఈ నెల 22 నుంచి ఐటీ 2.0 అమలు
19, 21 తేదీల్లో సేవలకు అంతరాయం