
ప్రైవేట్ ఆస్పత్రిలో మహిళ మృతి
పాలమూరు: జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో జరిగిన ఘటనలో చికిత్స కోసం వచ్చిన మహిళ మృతి చెందగా.. వైద్యుల నిర్లక్ష్యం వల్లే మృతి చెందిందని కుటుంబ సభ్యులు వైద్యుడితోపాటు ఇతర సిబ్బందిపై దాడి చేసి ఆ తర్వాత ఆందోళన చేసే క్రమంలో ఇరువర్గాల ఘర్షణలో ఐఎంఏ అధ్యక్షుడిపై దాడి జరిగింది. దీంతో రెండువర్గాలపై టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదు అయ్యాయి. టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్ కథనం ప్రకారం.. నారాయణపేట మండలం బోయిన్‌పల్లికి చెందిన దేవమ్మ(63)ను మూత్ర సంబంధిత సమస్యతో ఈనెల 13న జిల్లాకేంద్రంలోని రాజేంద్రనగర్‌లో ఉన్న యునైటెడ్ ఆస్పత్రిలో ఆడ్మిట్ చేశారు. రక్తం తక్కువగా ఉండడంతోపాటు మూత్ర సంబంధిత సమస్య ఉన్నట్లు గుర్తించి ఆమెకు చికిత్స ప్రారంభించారు. సోమవారం సాయంత్రం రక్తం ఎక్కించే క్రమంలో మహిళ మృతిచెందడంతో వైద్యుల నిర్లక్ష్యంతో మృతిచెందిందని కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణంలో ఏర్పడడంతో వైద్యుడు అమిత్ మహంకాళ్‌తోపాటు అక్కడ పనిచేసే సిబ్బందిపై మృతురాలి కుటుంబ సభ్యులు దాడికి పాల్పడడంతోపాటు ఫోన్ తీసుకోవడం, కేషీట్ చించివేసిట్లు సీఐ వెల్లడించారు. ఈ క్రమంలో సదరు ఆస్పత్రి వైద్యుడు అమిత్ మహాంకాళ్ కులం పేరుతో దూషించాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య చర్చ జరుగుతున్న క్రమంలో ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్‌పై ఓ వ్యక్తి దాడి చేశారు. వైద్యులపై దాడి చేయడంతోపాటు వారి విధులకు ఆటంకం కల్గించిన నలుగురిపై 308 క్లాజ్ 3, 329 క్లాజ్4, 352, 351, 118 క్లాజ్ 1, 115 క్లాజ్ 2, సెక్షన్–4తోపాటు మరికొన్ని సెక్షన్స్ కింద కేసు నమోదు చేశామని, అదేవిధంగా డాక్టర్ అమిత్ మహాంకాళ్‌పై ఎస్సీ, ఎస్టీ కేసుతోపాటు నిర్లక్ష్యమైన వైద్యం అనే సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.
ఓపీ సేవలు బంద్
యునైటెడ్ ఆస్పత్రిలో సోమవారం రాత్రి ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రామ్మోహన్‌తో యునైటెడ్ ఆస్పత్రి వైద్యుడు అమిత్ ఇతర సిబ్బందిపై జరిగిన దాడికి నిరసనగా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న అన్నిరకాల ప్రైవేట్ ఆస్పత్రుల్లో మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓపీ సేవలు నిలిపి వేశారు. అదేవిధంగా రెడ్‌క్రాస్ భవనంలో ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రైవేట్ వైద్యులు సమావేశం ఏర్పాటు చేసి జరిగిన దాడిపై చర్చించారు. అనంతరం ఎస్పీ జానకిని కలిసి దాడికి కారణమైన వారిపై ఫిర్యాదు చేయడంతోపాటు భవిష్యత్‌లో వైద్యులపై ఇలాంటి దాడులు జరగకుండా ఉండడానికి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ప్రైవేట్ వైద్యులు అందరూ కలిసి టూటౌన్ సీఐ ఇజాజుద్దీన్‌కు ఫిర్యాదు చేశారు.
వైద్యుడితోపాటు ఐఎంఏ అధ్యక్షుడిపై దాడి
మృతురాలికి సంబంధించిన నలుగురిపై పలురకాల సెక్షన్ల కింద కేసు
వైద్యుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
ఓపీ సేవలు బంద్‌చేసిన ప్రైవేట్ ఆస్పత్రులు, ఎస్పీకి ఫిర్యాదు

ప్రైవేట్ ఆస్పత్రిలో మహిళ మృతి