రైతుల శ్రేయస్సు కోసమే భూ భారతి చట్టం
దేవరకద్ర/చిన్నచింతకుంట: రైతుల శ్రేయస్సు కోసమే భూ భారతి చట్టం రూపొందించామని, ఈ చట్టంపై ప్రతిఒక్కరు అవగాహన కలిగి ఉండాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. దేవరకద్రలో నిర్వహించిన అవగాహన సదస్సులు ఆమె స్థానిక ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డితో కలిసి పాల్గొని మాట్లాడారు. భూ భారతితో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉ న్న భూ సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. రిజిష్ట్రషన్, సాదాబైనామా, సీలింగ్ అసైన్‌మెంట్, వారసత్వ భూములకు పరిష్కారం భూ భారతి వల్ల లభిస్తుందన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇచ్చి ధరణి స్థానంలో భూ భారతి చట్టం తీసుకువచ్చారన్నారు. ఈ చట్టంతో భూమి ఉన్న ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందన్నారు. అనంతరం దేవరకద్ర మార్కెట్ యార్డులో, చౌదర్‌పల్లిలోని ఐకేపీ నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వం మద్దతు ధరతోపాటు సన్నవడ్లకు అదనంగా రూ.500 బోనస్ ఇస్తుందన్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఎప్పటికప్పుడు రైస్ మిల్లులకు తరలించాలని, రైతుల నుంచి ధాన్యం కొనగోలు చేసిన తర్వాత పూర్తి బాధ్యత నిర్వాహకులదేనని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాలకు సరిపడా గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆయా కార్యక్రమాల్లో అదనపు కలెక్టర్ మోహన్‌రావు, డీఆర్‌డీఓ నవీన్, జిల్లా సహకార అధికారి శంకరాచారి, ముడా చైర్మన్ లక్ష్మన్‌యాదవ్, తహసీల్దార్ కృష్ణయ్య, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఏఓ రాజేందర్ అగర్వాల్, సీఈఓ శ్రీనివాసులు పాల్గొన్నారు.
● చిన్నచింతకుంటలోని ఎంఎస్ గార్డెన్ పంక్షన్ హాల్‌లో చిన్నచింతకుంట, కౌకుంట్ల మండలాల రైతులకు భూ భారతి చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను శుక్రవారం కలెక్టర్ పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.


