
న్యాయసేవలు పల్లెలకు విస్తరించాలి: జిల్లా జడ్జి
పాలమూరు: జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో అందిస్తున్న న్యాయసేవలను గ్రామీణస్థాయికి తీసుకువెళ్లి పేదలకు మేలు జరిగే విధంగా పారా లీగల్ వలంటీర్లు కృషి చేయాలని జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.పాపిరెడ్డి అన్నారు. జిల్లా కోర్టు ఆవరణలో శనివారం పారా లీగల్ వలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడారు. న్యాయ సేవలను విస్తరించేందుకు పారా లీగల్ వలంటీర్లు కృషి ఎక్కువగా ఉండాలని తెలిపారు. లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు, అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్‌లు, చైల్డ్ ఫ్రెండ్లీ కమిటీ ఆధ్వర్యంలో అందిస్తున్న న్యాయసేవలను మరింత మెరుగైన స్థాయిలో అందించాలన్నారు. అనంతరం పారా లీగల్ వలంటీర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి డి.ఇందిర పాల్గొన్నారు.
బాదేపల్లి యార్డుకుపోటెత్తిన మొక్కజొన్న
జడ్చర్ల/దేవరకద్ర: బాదేపల్లి మార్కెట్ యార్డుకు శనివారం మొక్కజొన్న దిగుబడులు పోటెత్తాయి. 4,579 క్వింటాళ్ల మొక్కజొన్న విక్రయానికి రాగా.. క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,260, కనిష్టంగా రూ.1,521 ధరలు లభించాయి. వేరుశనగ గరిష్టంగా రూ.6,100, కనిష్టంగా రూ.4,816, పెబ్బర్లు గరిష్టంగా రూ.4,957, కనిష్టంగా రూ.4,617, రాగులు గరిష్టంగా రూ.2,611, కనిష్టంగా రూ.2,511, జొన్నలు రూ.3,907, ధాన్యం హంస గరిష్టంగా రూ.1,969, కనిష్టంగా రూ.1,806, ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,209, కనిష్టంగా రూ.1,806, ఆముదాలు గరిష్టంగా రూ.6,278, కనిష్టంగా రూ.5,629, పత్తి రూ.5,389, శనగలు రూ.5,250 ధరలు లభించాయి. దేవరకద్ర లో ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం క్వింటాల్‌కు గరిష్టంగా రూ.2,209, కనిష్టంగా రూ.1,701, హంస ధాన్యం గరిష్టంగా రూ.1,809, కనిష్టంగా రూ.1,639గా, ఆముదాలు గరిష్టంగా రూ.5,981గా ఒకే ధర వచ్చింది.
పీయూలో కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మె
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం నుంచి నిరవధిక సమ్మె బాట పట్టారు. ఈ మేరకు పీయూ ప్రధాన గేట్ వద్ద మోకాళ్లపై నిలబడి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా సంఘం నాయకులు భూమయ్య, శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. నెట్, సెట్, పీహెచ్‌డీ వంటి అర్హతలు ఉన్న అధ్యాపకులను ఎలాంటి షరతులు లేకుండా నేరుగా రెగ్యులరైజ్ చేయాలని, జీఓ నంబర్ 21ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మెకు నాన్ టీచింగ్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామ్మోహన్, బుర్రన్న సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో రవికుమార్, సుదర్శన్‌రెడ్డి, విజయభాస్కర్, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, ఈశ్వర్‌కుమార్, ప్రదీప్ కుమార్, సురేశ్, మొయినుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.

న్యాయసేవలు పల్లెలకు విస్తరించాలి: జిల్లా జడ్జి