సేంద్రియ వ్యవసాయంతో లాభాలు
అలంపూర్: వ్యవసాయం పూర్వం సేంద్రియ ఎరువుల ద్వారానే జరిగేది. పూర్వీకులు రసాయన ఎరువులు, పురుగుల మందులు వినియోగించకుండానే పంటలు పండించేవాడు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆహార దిగుబడులు పెంచడానికి ఆధునిక వంగడాలతోపాటుగా రసాయనాల వినియోగించుకోవాల్సిన అవసరం నెలకొంది. రసాయన ఎరువులు, పురుగుల మందులు అధికంగా వాడుతూ దిగుబడులు పెంచుకోనే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితులను అధిగమించి సేంద్రియం ద్వారా పంటల సాగు ఎంతో నయంగా ఉంటుందని ఏడీఏ సక్రియ నాయక్ రైతులకు సూచించారు. వీటి వలన కలిగే లాభాలను రైతులకు వివరించారు.
రసాయనాల వాడకంతో..
● సాగులో విచక్షణ రహితంగా బస్తాల కొద్ది రసాయన ఎరువులను కుమ్మరించడంతో ఆ మందులను తట్టుకోనే స్థాయి పంటల్ని ఆశించే పురుగుకు పెరుగుతుంది.
● రసాయన ఎరువులు, పురుగుల మందులు అన్ని పంటకు అధికంగా వాడకంతో వాటిని తట్టుకోనే స్థాయి పురుగులు, తెగుళ్లు కాలక్రమేనా అధికమైపోతాయి.
● వీటి వినియోగం అధికంగా ఉంటే సాగు ఖర్చు విపరీతంగా పెరుగుతుంది.
● ఆహార ఉత్పత్తుల నాణ్యత తగ్గిపోతాయి.
● సరైన అవగాహన లేకుండా రసాయనాల వాడకం వలన వాటి అవశేషాలు నీటిలో, సాగు నేలలో కలిసి కలుషితమవుతాయి.
నష్టాలు–సూచనలు
● మితిమీరిన రసాయనాల వాడకంతో మిత్ర కీటకాలు నశించి పర్యావరణంలో వాతవరణ కాలుష్యం ఏర్పడుతుంది.
● ఆరోగ్యం, పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలి.
● వ్యవసాయంలో పురుగు మందులు, రసాయనాలు లేకుండా చూసుకోవాలి.
● ప్రపంచ ఆరోగ్య సంస్థ వ్యవసాయ ఒప్పందాల ప్రకారం మార్కెట్‌లో పోటీకి మన ప్రాంత రైతులు నిలవాలంటే నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి.
● పంట ఉత్పత్తులు తక్కువ ధరలకు లభించేలా సాగు చేసుకోవాలి.
సేంద్రియ విధానం
● సాగులో లింగాకర్షన బుట్టలు వాడాలి.
● పరిమితులకు లోబడి బీటీ వైరస్ శిలీంధ్రాన్ని వాడాలి.
● గంధకం, రాగి ఉత్పత్తులు వాడవచ్చు. వృక్ష సంబంధం నూనెల్ని కొన్ని జాగ్రత్తలతో వాడాలి.
● వేప సంబంధిత ఉత్పత్తులు, పచ్చిరొట్ట, వర్మీ కంపోస్టు ఎరువులను వాడాలి.
● పంట వ్యర్థాలు, కొబ్బరి వ్యర్థాలు, షజొల్లా ఉపయోగపడేవే.
● పంటల నుంచి వచ్చే బూడిద, జీవన ఎరువులు, జిప్సం పంటల్లో వాడుకోవచ్చు.
సేంద్రియ ఉత్పత్తులు..
● అంతర్జాతీయ మార్కెట్‌లో సేంద్రియ ఎరువులు నిలవాలంటే నిబంధనలు పాటించాల్సిందే.
● మన ప్రాంతంలోని నేలల్లో సేంద్రియ కర్భణం చాలా వరకు తగ్గిపోయి దిగుబడుల్లో రైతులు ఒడిదుడుకులను ఎదుర్కొవాల్సిన పరిస్థితి నెలకొంది.
● అనేక చోట్ల ఒక శాతం కర్భణం ఉన్నట్లు తెలుస్తోంది.
● సేంద్రియ కర్భనం పెంచడానికి కృషి చేయాలి.
● సేంద్రియ సాగు ద్వారా ఆహార ఉత్పత్తులు సాధించాలంటే ప్రపంచ దేశాలతోపాటు మన ప్రాంతంలో కూడా సేంద్రియ వ్యవసాయం చేసే రైతుల కమతాల్ని పరిశీలించి వారికి ధ్రువీకరణ పత్రం జారీ చేయడానికి కొన్ని ప్రమాణాలను ప్రభుత్వం నిర్ధేశించింది. ఆ జాబితాలు సిద్ధం అవుతున్నాయి.
● ఏదైన ఆహార ధాన్యాలు సేంద్రియ ఉత్పత్తిగా గుర్తించాలంటే సాగులో అనేక ప్రమాణాలు పాటించాల్సి ఉంటుంది.
● సేంద్రియ వ్యవసాయ ఉద్యమాల అంతర్జాతీయ సమాఖ్య కొన్ని సాగు ప్రమాణాలను సూచించింది.
● అనేక దేశాల్లో కొద్దిపాటి తేడాతో ప్రమాణాలు పాటిస్తున్నారు.
● ప్రమాణాల ప్రకారం నాటే విత్తనాల దగ్గర నుంచి ప్యాకింగ్ వరకు అనేక జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
సేంద్రియ ఎరువులతోనే సాధ్యం
జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తక్కువ ఖర్చుతో వ్యవసాయం చేసే దిశగ రైతులు అడుగులు వేస్తున్నారు.
సేంద్రియ ఎరువులైన వానపాముల ఎరువులు, పశువుల ఎరువులు, కోళ్ల ఎరువు, పచ్చి ఆకులు, పిండి చెక్కలు వాడాలి.
నాణ్యమైన, రుచికరమైన ఉత్పత్తుల ను పండించి దేశానికి అందించాల్సిన అవసరం ఉంది.
వ్యవసాయ శాఖ ద్వార చిన్న, సన్నకారు రైతులకు సైతం అందుబాటులో ఉండే వర్మీ కంపోస్టు బెడ్స్ రూ.5 వేల సబ్సిడీపై రైతులు పొందవచ్చు.
జీలుగు, జనుము, పిల్లి పెసర విత్తనాలను 5 శాతం సబ్సీడీపై అందిస్తున్నారు.


