
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/జెడ్పీసెంటర్ /జడ్చర్ల/ దేవరకద్ర: ఎన్నికల ప్రక్రియలో కీలకఘట్టం ముగిసింది. బుధవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులెవరో లెక్క తేలింది. జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తం 42 మంది పోటీలో ఉన్నారు. ఆయా నియోజకవర్గాలకు 58 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. అందులో స్క్రూట్నీ సందర్భంగా ఆరుగురివి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
మిగిలిన 52 మంది అభ్యర్థుల్లో పది మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో పోటీలో ఉన్న మిగిలిన అభ్యర్థుల తుది జాబితాను అధికారులు ప్రకటించారు. ఇందులో మహబూబ్‌నగర్‌లో 15 మంది, జడ్చర్లలో 15 మంది, దేవరకద్రలో 12 మంది పోటీలో నిలిచారు.
ఇక బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా తేలడంతో ఇక ప్రచారం హోరెత్తనుంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఇప్పటికే వాడవాడలా, ఇంటింటికీ తిరుగుతూ ముమ్మర ప్రచారం చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసిన నేపథ్యంలో ప్రచారం మరింత జోరందుకోనుంది.
జడ్చర్ల
జడ్చర్ల నియోజకవర్గంలో నలుగురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. 15 మంది అభ్యర్థులు బరిలో నిలవగా.. ప్రధానంగా బీఆర్‌ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి అనిరుధ్‌రెడ్డి మధ్యే పోటీ నెలకొంది. బీజీపీ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే చిత్తరంజన్‌దాస్ బరిలో ఉన్నప్పటికీ.. పోరు నామమాత్రమేనని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
పోటీలో ఉన్నవారు..: డా.సి. లక్ష్మారెడ్డి( బీఆర్‌ఎస్), జనంపల్లి అనిరుధ్‌రెడ్డి(కాంగ్రెస్), చిత్తరంజన్‌దాస్ (బీజేపీ), శివకుమార్(బీఎస్పీ), ఎడ్ల బాలవర్ధన్‌గౌడ్ (ఆల్‌ఇండియా ఫార్వర్డ్ బ్లాక్), ఇమ్మడి ఆనంద్(బహుజన ముక్తి), అనిల్‌కుమార్ (జన శంఖారావం), కె.నర్సింగ్‌రావు(గణసురక్ష పార్టీ), కోస్గి యాదయ్య(ధర్మసమాజ్), మాతాశ్రీ జానకమ్మ(రాష్ట్ర సమాఖ్య ప్రజా పార్టీ), శ్రీకాంత్ పిల్లెల (భారత చైతన్య యువజన పార్టీ), వెల్జాల బసవయ్య(ఆర్.సీపీఐ), స్వతంత్రులు ఏ.రవికుమార్, ఎల్.మోహన్, ముడావత్ శంకర్.
దేవరకద్ర
దేవరకద్ర నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోగా.. 12 మంది బరిలో నిలిచారు. ప్రధానంగా బీఆర్‌ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి జి.మధుసూదన్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి కొండా ప్రశాంత్‌రెడ్డి పోటీ పడుతున్నారు. అయితే బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్యే ద్విముఖ పోరు కొనసాగనున్నట్లు తెలుస్తోంది.
బీజేపీకి చెందిన బాలకృష్ణ అలియాస్ దేవరకద్ర బాలన్న తన నామినేషన్‌ను ఉప సంహరించుకున్నారు. అలాగే మరో స్వతంత్ర అభ్యర్థి ఎండీ అబ్దుల అజీజ్ ఖాన్ నామినేషన్‌ను ఉప సంహరించుకున్నారు.
పోటీలో ఉన్నవారు..: ఆల వెంకటేశ్వర్‌రెడ్డి (బీఆర్‌ఎస్), కొండా ప్రశాంత్‌రెడ్డి (బీజేపీ), జి.మధుసూదన్‌రెడ్డి (కాంగ్రెస్), బసిరెడ్డి సంతోష్‌రెడ్డి (బీఎస్పీ), గడ్డం ఎల్లప్ప (ప్రజాఏక్తా పార్టీ), జి.కతలయ్య (విద్యార్థుల రాజకీయ పార్టీ) బి.జంగయ్య (ధర్మ సమాజ్‌పార్టీ), బి.రాఘవేంద్ర (ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్), బి.మధుసూదన్‌రెడ్డి (జన శంఖారావం పార్టీ), స్వతంత్రులు మందడి వెంకట నర్సింహారెడ్డి, రాము, ఏ.వెంకటేశ్వర్‌రెడ్డి.
13 నియోజకవర్గాల్లో.. 186 మంది పోటీ
ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. షాద్‌నగర్ మినహా మిగిలిన 13 నియోజకవర్గాలకు సంబంధించి బుధవారం గడువు ముగిసే వరకు మొత్తం 37 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.
186 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీఎస్పీ తదితర పార్టీలు, స్వతంత్రులు పోటీలో ఉన్నప్పటికీ.. ప్రధానంగా బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్యే పోరు కొనసాగనుంది.
మహబూబ్‌నగర్
మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో నలుగురు నామినేషన్లను ఉపసంహరించుకోగా.. 15 మంది బరిలో ఉన్నారు. అయితే ప్రధానంగా బీఆర్‌ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే, రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి కుమారుడు ఏపీ మిథున్‌రెడ్డి మధ్యే పోరు కొనసాగనుంది.
పోటీలో ఉన్నవారు..: వీ.శ్రీనివాస్‌గౌడ్ (బీఆర్‌ఎస్), మిథున్‌రెడ్డి(బీజేపీ), యెన్నం శ్రీనివాస్‌రెడ్డి(కాంగ్రెస్), స్వప్న (బీఎస్పీ), ఇక్బాల్ అహ్మద్‌ఖాన్ (బహుజన్ ముక్తి పార్టీ), టి.కృష్ణ(భారత చైతన్య యువజన పార్టీ), ఖాదర్ (ప్రగతిశీల సమాజ్ పార్టీ), మున్నూర్ రవి (ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్), రాములు (ధర్మసమాజ్), శ్రీనివాస్‌రెడ్డి (జన శంకరం పార్టీ), స్వతంత్రులు అశోక్‌కుమార్ గజ్బింకర్, కారుకొండ శ్రీనివాసులు, ఎండీ ఇంతియాజ్ అహ్మద్, ఎండీ షరీఫ్, ఎం.శ్రీనివాసులు.
గుర్తుల కేటాయింపు..పరిశీలన
మహబూబ్‌నగర్‌లో అసెంబ్లీ ఎన్నికల పరిశీలకులు సంజయ్ కుమార్ మిశ్రా, అసెంబ్లీ వ్యయ పరిశీలకుడు కుందన్‌యాదవ్, దేవరకద్రలో ఎన్నికల వ్యయ పరిశీలకులు తేజశి్వ, ఐపీఎస్ అధికారి ఇళక్కియా కరునాగరన్ పాటు ఆయా రిటరి్నంగ్ అధికారులు అనిల్‌కుమార్, నటరాజ్ తదితరులు పోటీలో ఉన్న అభ్యర్థులకు గుర్తుల కేటాయింపును పరిశీలించారు.
జాతీయ, రాష్ట్ర స్థాయి రాజకీయ పార్టీలకు వరుసగా ఆ తరువాత రిజిస్టర్ గుర్తింపు రాజకీయ పారీ్టల అభ్యర్థులకు, చివరగా స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు.