మమత (ఫైల్)
నాగర్‌కర్నూల్ క్రైం: నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి కిందపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మహేందర్ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా.. జిల్లా కేంద్రంలోని హౌసింగ్‌బోర్డు కాలనీలో నిర్మాణంలో ఉన్న ఇంట్లో పుట్ట వెంకటస్వామి (55) వాచ్‌మన్‌గా పనిచేస్తున్నాడు. ఇంటికి నీటితో క్యూరింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తు జారీ కిందపడటంతో తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని జనరల్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండటంతో పరీక్షించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ రెఫర్ చేశారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. భార్య సీతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
బైక్‌ఢీకొని చిన్నారి..
దామరగిద్ద: బైక్ ఢీకొని చిన్నారి మృతి చెందిన ఘటన గురువారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే మండల కేంద్రానికి చెందిన అనసూయ, శివారెడ్డిల కుమార్తె మమత (11) రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే నారాయణపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రెండేళ్ల క్రితం భర్త ఆత్మహత్య చేసుకోగా, కూతురు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం కుటుంబం తీవ్ర విషాదంలో మునిగింది. మమత స్థానిక జెడ్పీహెచ్‌ఎస్‌లో ఆరో తరగతి చదువుతుండేది.
కింద పడి వ్యక్తి..
కొత్తకోట రూరల్: ఫ్యాక్టరీలోని గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పెద్దమందడి మండలంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అడ్డాకుల మండలం బలీదుపల్లికు చెందిన ఎర్రంశెట్టి బాలరాజుసాగర్(48) కొంత కాలంగా వెల్టూర్ సమీపంలో గల ఫాంఆయిల్ ఫ్యాక్టరీలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం నిచ్చెన జారి కిందపడటంతో ఫ్యాక్టరీలో గల ఖాళీగా ఉన్న గుంతలో పడి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నట్టు గ్రామస్తులు తెలిపారు. సంఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని ఎస్‌ఐ హరిప్రసాద్ తెలిపారు.
చికిత్స పొందుతూ..
లింగాల: మండలంలోని చెన్నంపల్లికి చెందిన మూడావత్ సీతారాంనాయక్(55) చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సీతారాంనాయక్ కొంత కాలంగా కడుపు నొప్పితో బాధపడుతూ నయం కాకపోవడంతో జీవితంపై విరక్తి చెంది పంట చేలకు వేసే పురుగుల మందును తాగినట్లు తెలిపారు. వెంటనే కుటుంబ సభ్యులు అచ్చంపేట ఆస్పత్రికి, అక్కడి నుంచి నాగర్‌కర్నూల్ తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య మత్లిబాయి, కుమార్తె ఉన్నారు. కుమార్తె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్‌సీ వెంకటేష్ తెలిపారు.
మహిళ
బల్మూర్ మండలంలో మహిళ..
బల్మూర్:మండలంలోని పోలిశెట్టిపల్లికి చెందిన వస్కుల కృష్ణమ్మ(50) కడుపునొప్పి భరించలేక గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
50 గొర్రెలు మృతి
నాగర్‌కర్నూల్ క్రైం: టిప్పర్ ఢీ కొనడంతో 50 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని ఔరాసిపల్లి గ్రామ శివారులో గురువారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా.. మండలంలోని బొందలపల్లికి చెందిన కుర్వ ఆంజనేయులు తన గొర్రెలు మేత మేపిన అనంతరం తిరిగి వాటిని తీసుకువస్తు రోడ్డు దాటిస్తుండగా టిప్పర్ వేగంగా వచ్చి గొర్రెలను ఢీకొనడంతో గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి.


