
రైతుబీమా దరఖాస్తు ప్రక్రియను పరిశీలిస్తున్న జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేష్
మహబూబ్‌నగర్ రూరల్: ఒక్క గుంట పొలం ఉన్నా రూ.5లక్షలు రైతు బీమా పథకానికి అర్హులని, జిల్లాలో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతులు బీమా కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బి.వెంకటేష్ తెలిపారు. బుధవారం మండల పరిధిలోని అప్పాయిపల్లి, ఓబ్లాయిపల్లి గ్రామాలలో ఆయన పర్యటించి వానాకాలం పంటల సాగు తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు బీమా పథకం రైతు కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు. కొత్త పాసు పుస్తకాలు వచ్చిన రైతులు, అలాగే పాత పాసు పుస్తకాలు ఉన్న రైతులు దరఖాస్తు చేసుకునేందుకు వారికి ప్రభుత్వం ఆగస్టు 5వ తేదీ వరకు అవకాశం కల్పించిందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాల్సిన వారు సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి కొత్తగా వచ్చిన భూమి పాస్ బుక్కు, రైతు ఆధార్ కార్డు, నామినీ ఆధార్ కార్డు, నామినీ బ్యాంకు పాసు బుక్కు, ఎల్‌ఐసీ రైతు బీమా దరఖాస్తు జిరాక్స్ కాపీలను సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు కృష్ణకాంత్, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయశాఖ అధికారి వెంకటేష్