ములుగు: ములుగు జిల్లాలో తొలిసారి ప్రైవేట్ రంగంలో ఐటీ సంస్థ ఏర్పాటు కావడం సంతోషకరమని, గ్రామీణ ప్రాంత యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సాంకేతిక రంగంలో భవిష్యత్‌కు దారులు వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన శ్రియా ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఐటీ రంగం ప్రధానంగా నగరాలకు మాత్రమే పరిమితమైందని, ఐటీ అవకాశాలు గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాలకు కూడా చేరుకోవా ల్సిన అవసరం ఉందన్నారు. శ్రియా ఇన్ఫోటెక్ సంస్థ సంవత్సర కాలంగా ములుగు ప్రాంత యువతకు వివిధ రంగాల్లో సాంకేతిక శిక్షణ అందిస్తూ యాప్ డెవలప్‌మెంట్ వంటి ఆధునిక నైపుణ్యాలను నేర్పిస్తూ ముందుకు సాగుతోందన్నారు. ప్రస్తుతం సంస్థలో సుమారు 15 మంది ఉద్యోగాలు పొందడం అభినందనీయమన్నారు. ములుగు జిల్లాలో ఇతర ఐటీ సంస్థలు, కంపెనీలు స్థాపించడానికి ముందుకు రావాలని, పెట్టుబడులు పెట్టే వారికి ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం అన్ని విధాలా సహకారం అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, ములుగు మున్సిపాలిటీ చైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ, శ్రియా ఇన్ఫోటెక్ వ్యవస్థాపకుడు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ యువతకు స్థానికంగానే
ఉపాధి కల్పించాలి
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి
ధనసరి సీతక్క


