పిల్లలకు పౌష్టికాహారం అందించాలి | - | Sakshi
Sakshi News home page

పిల్లలకు పౌష్టికాహారం అందించాలి

Apr 10 2026 10:33 AM | Updated on Apr 10 2026 10:33 AM

మహబూబాబాద్‌: పిల్లలకు పౌష్టికాహారం అందించాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రణామ్‌ వయోవృద్ధుల డే కేర్‌ సెంటర్‌ను గురువారం మంత్రి ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌ ప్రధాన సమావేశ మందిరంలో అంగన్‌వాడీ టీచర్లు, సూపర్‌ వైజర్లకు సెల్‌ఫోన్లు పంపిణీ చేశారు. కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ములుగు జిల్లాలో పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు సరఫరా చేస్తున్నామని, త్వరలో అన్ని జిల్లాలో సరఫరా చేస్తామన్నారు. కల్తీ సరుకులు కేంద్రాలకు సరఫరా అయితే వెంటనే తిరస్కరించాలన్నారు. తొలి ఒడి అమ్మ అయితే మలి ఒడి అంగన్‌వాడీ కేంద్రాలు అన్నారు. అమ్మ మాట–అంగన్‌వాడీ బాట నినాదాలకే పరిమితం కాకుండా ఆచరణలో అమలు చేయాలన్నారు. ప్రతీ నియోజకవర్గంలో ఒక డే కేర్‌సెంటర్‌ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. వయోవృద్ధులు బాధల నుంచి ఉపశమనం పొందడానికి సెంటర్లు ఉపయోగపడుతాయన్నారు. కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పోషణ్‌ పక్వాడ కార్యక్రమం చేపట్టిందన్నారు. అంగన్‌వాడీ టీచర్లకు ఓపిక ఉండడం వల్ల అంత మంది పిల్లలను చూసుకోగలుగుతున్నారన్నారు. ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ మాట్లాడుతూ.. తల్లీబిడ్డ బాధ్యత అంతా అంగన్‌వాడీలపైనే ఉందన్నారు. పని తీరును మెరుగుపర్చుకోవడానికే సెల్‌ఫోన్లు అందించినట్లు చెప్పా రు. వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే ప్రతీ నెల వారికి రూ.10,000 ఇవ్వాలని, లేకపోతే వేతనంలో 15శాతం ఇచ్చే విధంగా బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ.. నిరంతరం సేవచేసే భాగ్యం అంగన్‌వాడీలకు కలిగిందన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లెనిన్‌ వత్సల్‌ టొప్పో, కె.అనిల్‌కుమార్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుగులోత్‌ జ్యోతి, డీడబ్ల్యూఓ సబిత, తహసీల్దార్‌ చంద్ర రాజేశ్వర్‌, సీడీపీఓ శిరీష, కౌన్సిలర్లు చిదిరాల అరుణ, నిమ్మల మాధవి, సీనియర్‌ సిటిజన్లు తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగులు డ్యూటీ వదిలి రోడ్డెక్కొద్దు

ఉద్యోగులు డ్యూటీ వదిలి రోడ్డెక్కొద్దని, సమస్యలను వేరేవిధంగా పరిష్కరించుకోవాలని మంత్రి ధనసరి సీతక్క అన్నారు. కలెక్టరేట్‌ ఆవరణలో గురువారం మంత్రి సీతక్కను కలిసి తమ సమస్యలు చెప్పుకోవడానికి అధిక సంఖ్యలో పంచాయతీ కార్యదర్శులు వచ్చారు. కాగా వారిలో కొంత మందిని మాత్రమే మంత్రిని కలిసే అవకాశం ఇచ్చారు. అయితే కాన్వాయ్‌ వద్దకు అధిక సంఖ్యలో పంచాయతీ కార్యదర్శులు రావడంతో.. ఆమె స్వయంగా వారి వద్దకు వెళ్లి మాట్లాడారు. ఇటీవల కలెక్టర్‌ పంచాయతీ కార్యదర్శులందరినీ డిప్యుటేషన్‌ పేరుతో దూరప్రాంతాలకు బదిలీ చేశారని, చిన్నపిల్లలు, ఆరోగ్య సమస్యలు ఉన్నవారిని పక్క మండలాలకు బదిలీ చేయాలని విన్నవించారు. మంత్రి స్పందించి దూర ప్రాంతాలకు కాకుండా పక్క మండలాలకు డిప్యుటేషన్‌ వేసేవిధంగా కలెక్టర్‌కు చెబుతానన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శుల అసోసియేషన్‌ నాయకులు శ్రీకాంత్‌, ప్రవీణ్‌, ఉమేష్‌, రాజేష్‌, వినయ్‌ తదితరులు పాల్గొన్నారు.

త్వరలో అన్ని అంగన్‌వాడీ

కేంద్రాలకు పాలు సరఫరా

పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి

ధనసరి సీతక్క

అంగన్‌వాడీలకు సెల్‌ఫోన్ల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement