పైరవీల జోరు.. | - | Sakshi
Sakshi News home page

పైరవీల జోరు..

Apr 10 2026 10:33 AM | Updated on Apr 10 2026 10:33 AM

సీనియారిటీ పక్కన పెట్టి ఎంపిక

చేసినట్లు ఆరోపణలు

పీపీఎల్‌ఎస్‌, రెమ్యునరేషన్‌ కోసం ఉపాధ్యాయుల ఆరాటం

జనగణన ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల కోసం పైరవీ

సాక్షి, మహబూబాబాద్‌:

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనగణన చేపడుతోంది. ఈమేరకు జనగణన విధులు నిర్వర్తించేందుకు ఉపాధ్యాయులు పోటీ పడుతున్నారు. వేసవిలో పనితో పాటు తగిన పారితోషికం, పీపీఎల్‌ఎస్‌ రావడంతో డ్యూటీలు చేసేందుకు అవకాశం ఇవ్వాలని పైరవీలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వ నిబంధనలు పక్కన పెట్టి కొందరు మండల విద్యాశాఖ అధికారులు నియామకాలు చేపట్టారనే ఆరోపణలు వస్తున్నాయి.

మే 11నుంచి గణన

ప్రభుత్వ పథకాల అమలు, ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై అంచనా వేయడం మొదలైన అవసరాలకోసం ప్రతీ పది సంవత్సరాలకోసారి జనగణన చేస్తారు. అయితే 2021లో జరగాల్సిన జనగణన కరోనా కారణంగా చేపట్టలేదు. తర్వాత వివిధ కారణాలతో జనగణన చేయలేకపోయారు. దీంతో వచ్చే మే నెల నుంచి గణన చేసేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ముందుగా మే 11 నుంచి జూన్‌ 9 వరకు ఇంటింటికి వెళ్లి ఇంటినంబర్‌ మొదలుకొని, ఇంటినిర్మాణ పరిస్థితి, కుటుంబ సభ్యుల సంఖ్య, కులం, తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు, డ్రెయినేజీ ఇలా మొత్తం 33 అంశాల వివరాలు సేకరిస్తారు. వీటి ఆధారంగా 2027 ఫిబ్రవరిలో జనగణన చేస్తారు. ఇందుకోసం మూడు విడతల్లో శిక్షణ ఇవ్వనున్నారు.

రెమ్యునరేషన్‌..

జనగణన కాలంలో పనిచేసిన వారికి పారితోషికంతో పాటు, పీపీఎల్‌ఎస్‌ ఇస్తారు. జిల్లాలోని 18 మండలాలు, 482 గ్రామ పంచాయితీలతోపాటు, ఐదు మున్సిపాలిటీల్లో ముందుగా ఇళ్ల సంఖ్యను, తర్వాత జనాభాను లెక్కించాలి. ఇందుకోసం 1,450మంది ఎన్యుమరేటర్లు, 252 మంది సూపర్‌వైజర్లు మొత్తం 1,702 మందిని నియమిస్తారు. వీరికి గణన చేసిన కాలం, శిక్షణ కాలంలో ఒక్కరికి రూ. 25వేల మేరకు పారితోషికం ఇవ్వడంతోపాటు 16కు పైగా ఆర్జిత సెలవులు(పీపీఎల్‌ఎస్‌) ఇస్తారు. అంటే ఈ సర్వేలో పాల్గొన్న ఒక్కొక్కరికి వారి స్థాయిని బట్టి రూ.75వేల నుంచి రూ.లక్ష వరకు వస్తుంది. దీంతో ఈ డ్యూటీలు చేసేందుకు ఉపాధ్యాయులు పోటీ పడుతున్నారు.

పైరవీలు..

సర్వేలు, లెక్కలు చేయడంలో ఉపాధ్యాయులు అయితే కచ్చితంగా ఉంటుందనే నమ్మకం. ఇందులో భాగంగానే జనగణన కోసం కూడా ఉపాధ్యాయులనే ఎంపిక చేస్తున్నారు. అయితే జిల్లా ఉన్నతాధికారుల నుంచి మండలాల వారీగా తహసీల్దార్ల పర్యవేక్షణ ఉంటుంది. కాగా, మండలాల వారీగా ఉపాధ్యాయుల ఎంపికప్రక్రియను మండల విద్యాశాఖ అధికారులకు అప్పగించారు. అయితే జనగణన చేసేందుకు ఉపాధ్యాయులు పోటీ పడడంతో కొందరు ఎంఈఓలు తమకు అనుకూలమైన వారికి, పైరవీలు చేసిన వారికి డ్యూటీలు వేసినట్లు సమాచారం. ఇలా చేయడం వల్ల పలు మండలాల్లో సీనియర్లకు కాకుండా జూనియర్లకు జనగణన డ్యూటీలు పడడంతో ఉపాధ్యాయులు నివ్వెరపోతున్నారు. ఈ విషయంపై అర్హులకు డ్యూటీలు వేయాలని పలువురు ఉపాధ్యాయ సంఘాల నాయకులు జిల్లా ఉన్నతాధికారులను కలిసి వినతి పత్రాలు కూడా అందజేశారు. నిబంధనలు విస్మరించి ఇష్టారాజ్యంగా డ్యూటీలు వేసిన ఎంఈఓలపై చర్యలు తీసుకోవాలని, అర్హులకు డ్యూటీలు వేయాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement