సబ్‌ జైలులో మెగా హెల్త్‌ క్యాంప్‌ | - | Sakshi
Sakshi News home page

సబ్‌ జైలులో మెగా హెల్త్‌ క్యాంప్‌

Apr 10 2026 10:33 AM | Updated on Apr 10 2026 10:33 AM

మహబూబాబాద్‌ రూరల్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా కేంద్రంలోని సబ్‌ జైలులో గురువారం మెగా హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా జైలర్‌ మల్లెల శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ప్రజాపాలనలో భాగంగా సబ్‌ జైలులో ఖైదీలకు ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించామన్నారు. వైద్యాధికారుల సహకారంతో విచారణ ఖైదీలకు మొబైల్‌ ఎక్స్‌ రే మెషీన్లతో పరీక్షలు నిర్వహించామని, ఐదుగురు ప్రధాన డాక్టర్లతో సహా పెద్ద సంఖ్యలో టెక్నీషియన్లు, మెడికల్‌ వలంటీర్లు ఏకకాలంలో ప్రతి ఖైదీకి, జైలు సిబ్బందికి సైతం వైద్య సహాయం అందించారని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ జైలర్‌ పట్టెం భిక్షపతి, వడ్డెబోయిన శ్రీనివాస్‌, సిటిజన్‌ ఫోరం సభ్యులు శంతన్‌ రామరాజు, మెడికల్‌ ఆఫీసర్లు అర్జున్‌, అనిత, ప్రియాంక, కల్యాణి, మౌనిక, అన్నపూర్ణ, శివరాం, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఆశకార్యకర్తలు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతివేగంతోనే ప్రమాదాలు

మహబూబాబాద్‌: వాహనాల సంఖ్య పెరగడం, అతివేగంగా డ్రైవింగ్‌ చేయడమే ప్రమాదాలకు కారణమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు అన్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌ సచివాలయం నుంచి గురువారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా అరైవ్‌–అలైవ్‌ కార్యక్రమం అమలుపై కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం రోడ్డు భద్రతపై తగిన చర్యలను చేపడుతున్నప్పటికీ రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతూనే ఉన్నాయన్నారు. ఈ నెల 13 నుంచి 18వ తేదీవరకు రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్‌– అలైవ్‌ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేసి విజయవంతం చేయాలన్నారు . వీసీలో జిల్లా నుంచి కలెక్టర్‌ స్నేహ శబరీష్‌ , ఎస్పీ శబరీష్‌, అదనపు కలెక్టర్లు లెనిన్‌ వత్సల్‌ టొప్పో, అనిల్‌కుమార్‌, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వశాఖలో కొలువు సాధించిన శ్రావణ్‌

ఇనుగుర్తి: మండలంలోని చిన్ననాగారం గ్రామానికి చెందిన బైరు శ్రావణ్‌ కుమార్‌ బుధవారం సాయంత్రం ప్రకటించిన స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఫలితాల్లో ఆల్‌ ఇండియా 7,078వ ర్యాంకు, ఓబీసీలో 2,837వ ర్యాంకు సాధించారు. ఈమేరకు కేంద్ర ప్రభుత్వ శాఖ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌లో సూపరింటెండెంట్‌ పోస్టు సాధించారు. ఉద్యోగం సాధించిన శ్రావణ్‌ కుమార్‌ను గ్రామ ప్రజలు అభినందించారు.

గ్రామస్థాయి నుంచి బలోపేతం కావాలి

గూడూరు: తెలంగాణలో బీజేపీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కృషి చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వద్దిరాజు రాంచందర్‌రావు అన్నారు. మండలంలోని మచ్చర్ల శివారు తార్యతండాలోని జాతీయ ఎస్టీ కమిషన్‌ సభ్యుడు జాటోతు హుస్సేన్‌నాయక్‌ గృహంలో గురువారం పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు ప్రారంభించి మాట్లాడారు. బూత్‌స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించాలన్నారు. బీజేపీ కార్యపద్ధతి, సైద్ధాంతిక పునాది, పార్టీ చరిత్ర, వికాసం తెలియజేయాలన్నారు. బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సమావేశంలో నాయకులు వెంకన్న, సురేందర్‌, పూనెం మణిచందర్‌, సర్పంచ్‌లు వీరన్న, కమల, కార్యకర్తలు పాల్గొన్నారు.

వేయిస్తంభాల దేవాలయ అభివృద్ధికి నిధులు

హన్మకొండ కల్చరల్‌: వేయిస్తంభాల దేవాలయం పునరుద్ధరణ పనుల కోసం కేంద్ర ప్రభుత్వం మరో విడత భారీ నిధులను మంజూరు చేయడంపై బీజీపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రావు పద్మ హర్షం వ్యక్తం చేశారు. గురువారం ఆమె పలువురు నాయకులతో కలిసి వేయిస్తంభాల ఆలయాన్ని సందర్శించారు. కేంద్ర పురావస్తుశాఖ (ఏఎస్‌ఐ) ద్వారా ఇటీవల మంజూరైన రూ.14.44కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement