● అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
గూడూరు: రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, అవసరమైన మందులు అందుబాటులో పెట్టుకోవాలని అడిషనల్ కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో సూచించారు. మండల కేంద్రంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌తోపాటు చెంద్రుగూడెంలోని ట్రైబల్ వెల్ఫేర్ బాలికల ఆశ్రమ పాఠశాలను బుధవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలో ఇన్ పేషెంట్ వార్డును పరిశీలించారు. ఓపీ వివరాలతో పాటు వైద్యులు, సిబ్బంది విధులపై ఆరా తీశారు. వైద్యులు నిత్యం అందుబాటులో ఉండాలన్నారు. అనంతరం చెంద్రుగూడెంలోని పాఠశాలలో తరగతి గదులు, స్టోర్ రూం పరిశీలించారు. రుచికరమైన భోజనం మెనూ ప్రకారం వడ్డించాలని నిర్వాహకులకు సూచించారు. పదో తరగతిలో ప్రతీ ఒక్కరు ఉత్తీర్ణులయ్యేలా శ్రద్ధవహించాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ ఎంపీడీఓ సత్యనారాయణ పాల్గొన్నారు.


