● భూమి తిరిగి అప్పగించాలని విజ్ఞప్తి
పాలకుర్తి టౌన్: జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని వావిలాల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు దాతృత్వంగా ఇచ్చిన భూమి తిరిగి అప్పగించాలని బుధవారం గ్రామానికి చెందిన నిరుపేద మహిళ దొంగరి శ్రీలత ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలిపింది. రెండు దశాబ్దాల క్రితం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు దొంగరి శ్రీలత, ఉపేందర్‌రావు దంపతులతో పాటు వారి పాలివాళ్లు కలిసి 400 గజాలకు పైగా భూమిని విరాళంగా ఇచ్చారు. దొంగరి శ్రీలత, ఉపేందర్‌రావు దంపతులకు కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు హైదరాబాద్‌లో ఆర్టీసీ కండక్టర్‌గా పని చేస్తున్నారు. ఉపేందర్‌రావు 15 ఏళ్ల క్రితం మృతి చెందారు. శ్రీలత గ్రామంలో ఉన్న తన ఇల్లు శిథిలావస్థకు చేరడంతో బంధువుల ఇంటిలో నిద్రిస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో డబుల్‌బెడ్ రూం ఇల్లు ఇవ్వాలని సంబంధిత అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చేసేదేమి లేక స్థానిక ప్రభుత్వ పాథమిక పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన తెలిపింది. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు గేటు బయట వేచి ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎంఈఓ పోతుగంటి నర్సయ్య పాఠశాల వద్దకు చేరుకున్నారు. అనంతరం పాఠశాల హెచ్‌ఎం తండ మల్లయ్యతో కలిసి మాట్లాడుతూ ఈ విషయంపై అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో శ్రీలత నిరసన విరమించింది.


