న్యూశాయంపేట : ఢిల్లీలోని ప్రతిష్టాత్మక జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ సివిల్స్ సర్వీసెస్ ఉచిత శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిందని, దీనిని అర్హులైన మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మహ్మద్ యాకూబ్ పాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులకు మే 26వ తేదీ వరకు గడువు ఉందని, ప్రవేశ రుసుం రూ. 1,325 చెల్లించి ఆన్‌లైన్‌లో హెచ్‌టీటీపీఎస్:అడ్మిషన్.జేఎంఐ.ఏిసీ.ఇన్ వెబ్‌సైట్‌లో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ప్రవేశ పరీక్ష జూ న్ 6వ తేదీన హైదరాబాద్‌లో నిర్వహిస్తారని తెలిపారు. మరిన్ని వివరాలకు 8520860785 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
విపత్తుల పర్యవేక్షణ వ్యవస్థ వివరాలివ్వండి
● వరంగల్ ఎంపీ డాక్టర్ కావ్య
హన్మకొండ చౌరస్తా: వరంగల్ జిల్లాలో భూకంప, వర్షాలు, ఉరుములు, మెరుపుల హెచ్చరికలు అందించేందుకు ప్రత్యేక డాప్లర్ వెదర్ రాడార్ లేదా ఆధునిక పర్యవేక్షణ వ్యవస్థలపై వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎంపీ కావ్య ఆధునిక విపత్తుల పర్యవేక్షణ వివరాలపై ప్రశ్నించారు. వరంగల్ వంటి ఉష్ణతరంగాలు, అనియంత్రిత వర్గాలకు గురయ్యే ప్రాంతాల్లో వాతావరణ మార్పులకు తట్టుకునే సామర్థ్యం పెంపు, విపత్తు నిర్వహణ చర్యలపై వివరాలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. భూకంప పరిశీలన కేంద్రాలు, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు, వాతావరణ పరిశోధన కేంద్రాల ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో సమన్వయం అవసరమని సూచించారు. కావ్య ప్రశ్నకు భూ విజ్ఞాన శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ సమాధానం ఇచ్చారు. వరంగల్ జిల్లా సిస్మిక్ జోన్–2 తక్కువ ప్రమాద స్థాయిలో ఉందని పేర్కొన్నారు. మైక్రోజోనేషన్ అధ్యయనాలు ఇప్పటి వరకు చేపట్టలేదన్నారు. ప్రస్తుతం ఐదు ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు పనిచేస్తున్నాయని వెల్లడించారు.
గంజాయి తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
ఐదు కిలోల సరుకు స్వాధీనం
జనగామ రూరల్: ఒడిశా నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒడిశాకు చెందిన భగవాలే రాజ్ కుమార్, కోట నిఖిల్‌ను ఎస్సై సతీశ్, కానిస్టేబుళ్లు రాజ్ కుమార్, రమేశ్, సాగర్ తనిఖీ చేశారు. ఇందులో వారి వద్ద ఉన్న బ్యాగుల్లో సుమారు 5 కిలోల గంజాయి లభించింది. దీంతో స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు.
పాముకాటుతో మహిళ మృతి
మల్హర్: పాముకాటుతో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన బుధవారం మండల కేంద్రం తాడిచర్లలో చోటు చేసుకుంది. తాడిచర్ల గ్రామానికి చెందిన గంగుల రాధమ్మ(50) తెల్లవారుజామున ఇంటి పనులు చేస్తున్న క్రమంలో పాముకాటు వేసింది. గమనించిన కుటుంబీకులు 108లో మంథని ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గోదావరిఖనికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.


