నిమిషమైతే ఇంటికి.. ఆ లోపే మృత్యుఒడికి
● టాటా ఏస్‌ను ఢీకొన్న లారీ..
● కూరగాయల వ్యాపారి
దుర్మరణం
హసన్‌పర్తి : నిమిషమైతే ఇంటికి చేరే వాడు. ఆ లోపే మృత్యుఒడికి చేరాడు. లారీ .. టాటా ఏస్ వాహనాన్ని ఢీకొన్న ప్రమాదంలో ఓ కూరగాయల వ్యాపారి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఈ ఘటన హసన్‌పర్తి మండల కేంద్రంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. హసన్‌పర్తికి చెందిన పెద్దోళ్ల శ్రీనివాస్(34) రోజూ ఉదయం టాటా ఏస్ వాహనంలో వరంగల్ మార్కెట్‌కెళ్లి కూరగాయలు కొనుగోలు చేసి ఇంటి వద్ద విక్రయిస్తుంటాడు. రోజుమాదిరిగానే మంగళవారం ఉదయం వరంగల్ మార్కెట్‌కెళ్లి కూరగాయలు కొనుగోలు చేసి తిరిగి హసన్‌పర్తికి పయనమయ్యాడు. హసన్‌పర్తి పాత కట్టల మిషన్ వద్దకు చేరుకోగానే కరీంనగర్ నుంచి హనుమకొండ వైపునకు ఎదురుగా వస్తున్న లారీ.. టాటా ఏస్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం తరలించారు. మృతుడి భార్య రమ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై దేవేందర్ తెలిపారు.


