
పదేళ్లలో చేయలేనిది రెండేళ్లలో చేసిచూపాం
కొత్తగూడ: పదేళ్లలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేయలేని పనులు రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం చేసి చూపిందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర,శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఓటాయి క్రాస్‌రోడ్డు సమీపంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుండా బీఆర్‌ఎస్ నాయకులు స్వలాభం కోసం తాత్కాలిక పనులు చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సకాలంలో బ్రిడ్జి నిర్మాణం చేపట్టి అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దివంగత ముఖ్య మంత్రి రాజశేఖరరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డులు ఇచ్చిందని, మళ్లీ ఇప్పుడు సీంఎ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో జారీ చేశామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో మాత్రమే సన్న బియ్యం పంపిణీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రానికి యూరియా సరఫరా చేయడంలో కేంద్రం మొండి చేయి చూపినా కొత్తగూడ మండలానికి సరిపోను సరఫరా అయ్యే విధంగా చూస్తామని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. కొందరు బీఆర్‌ఎస్ నాయకులు కావాలని బద్నాం చేసేందుకు యత్నిస్తున్నారని, వారి మాటలు నమ్మవద్దని అన్నారు. ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన వారికి మహిళా సంఘాల ద్వారా ప్రత్యేక రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎంపికై న వారు వెంటనే ఇంటి పనులు ప్రారంభించాలని సూచించారు. కొత్తగూడ, గంగారం మండలాలకు ఇప్పటికే వెయ్యి ఇళ్లు మంజూరయ్యాయని, మరో 200ఇళ్ల మంజూరు కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ముందుగా గుంజేడు ముసలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన సీతక్క ఆలయ అభివృద్ధి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఐటీడీఏ పీఓ చిత్రామిశ్రా, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క