
పంట మార్పిడి విధానంతో రైతులకు మేలు
మహబూబాబాద్ రూరల్: రైతులు పంట మార్పిడి విధానాన్ని అలవర్చుకోవాలని, సేంద్రియ ఎరువుల వాడకాన్ని అలవాటు చేసుకోవాలని డీఏఓ ఎం.విజయనిర్మల అన్నారు. ఐసీఏఆర్, ఐఐఎంఆర్ షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళిక ఆర్థిక సహకారంతో మహబూబాబాద్ మండలంలోని మల్యాల జేవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానం ఆధ్వర్యంలో శుక్రవారం ఉద్యాన రైతులకు శిక్షణ ఏర్పాటు చేసి ఉచితంగా పండ్ల మొక్కలు పంపిణీ చేశారు. ముందుగా కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ముద్రించిన మిరప పంటలో నల్ల తామర పురుగుల సమగ్ర యాజమాన్యం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఏఓ విజయనిర్మల మాట్లాడుతూ.. ఎరువుల వాడకం తగ్గించి, సహజ వ్యవసాయాన్ని అవలంబించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి జినుగు మరియన్న మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ పంట సాగు విధానం, ప్రభుత్వ సబ్సిడీ వివరాలు, పంటతో వచ్చే లాభాల గురించి రైతులకు వివరించారు. రైతులు ప్రభుత్వ రాయితీలను వినియోగించుకోవాలని తెలిపారు. జేవీఆర్ ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త, అధిపతి కత్తుల నాగరాజు, కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ క్రాంతికుమార్, శాస్త్రవేత్త ప్రశాంత్ మాట్లాడారు. మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులను సాధించిన పలువురు రైతులను శాస్త్రవేత్తలు, అధికారులు సన్మానించారు. సమావేశంలో కేవీకే శాస్త్రవేత్త సుహాసిని, మల్యాల ఉద్యాన కళాశాల టీచింగ్ అసోసియేట్స్ డాక్టర్ పరమేశ్వర్, డాక్టర్ అశోక్, రైతులు పాల్గొన్నారు.
డీఏఓ ఎం.విజయనిర్మల