
ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించాలి
చిన్నగూడూరు: ప్రజల ఆరోగ్యం, విద్యార్థుల చదువుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్, ఉగ్గంపల్లి పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పీహెచ్‌సీలో రికార్డులను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో సాధారణ ప్రసవాలను పెంచి, అబార్షన్‌లు జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతీ ఇంటికి తిరిగి ఆరోగ్య సర్వే నిర్వహించి, వివరాలు సేకరించాలన్నారు. ఇన్‌పేషెంట్, ఔట్ పేషెంట్ వివరాల రిజిస్టర్లను పరిశీలించి, పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులకు అందిస్తున్న విద్య, ఆహారం తదితర అంశాలపై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదిలో విద్యార్థుల చదువు సామర్థ్యాలను పరీక్షించారు. ప్రభుత్వ మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని సూచించారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల అడ్మిషన్లు, హాజరుశాతం గణనీయంగా పెరిగినందున అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంపత్‌కుమార్, ఎంపీడీఓ యాకయ్య, ఎంపీఓ రజని, డాక్టర్ ప్రవీణ్‌కుమార్, ఇన్‌చార్జ్ హెచ్‌ఎం రెహమాన్, ఉపాధ్యాయులు, వైద్యసిబ్బంది తదితరులు ఉన్నారు.
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో