
‘కాసం’ ప్రజాపోరాటాలు చిరస్మరణీయం
● నేడు నీర్మాలలో కృష్ణమూర్తి వర్ధంతి
దేవరుప్పుల : భూమి కోసం..భుక్తి కోసం..బానిస బంధాల విముక్తి కోసం కొనసాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంగా కాసం కృష్ణమూర్తి చేపట్టిన ప్రజాపోరాటాలు చిరస్మరణీయం. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాలకు చెందిన కాసం కృష్ణమూర్తి గ్రామాల్లో భూస్వాములు, దేశ్‌ముఖ్‌ల పెత్తందారి వ్యవస్థపై ఎదురుదిరిగారు. తన తుదిశ్వాస వరకూ సీపీఎం అనుబంధ ఉమ్మడి రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడిగా అనేక విరోచిత పోరాటాలు చేపట్టారు. కాసం వారసత్వాన్ని అందిపుచ్చుకునే క్రమంలో శుక్రవారం నీర్మాలలో ఆయన వర్ధంతి సభ నిర్వహించనున్నారు. ఈ సభను జయప్రదం చేయాలని సీపీఎం మండల కార్యదర్శి ఇంటి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఫ్యూడల్, రాచరిక పాలన, కులవివక్షకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించి దళాలుగా ఏర్పడి ఈ ప్రాంత భూస్వాములు, దేశ్‌ముఖ్‌లను తరిమిన మహావీరుడు, రాష్ట్రపతి అవార్డు గ్రహీత కాసం కృష్ణమూర్తి అన్నారు. కార్యక్రమంలో నాయకులు పయ్యావుల భిక్షపతి, గడ్డం యాదగిరి, కున్సోత్ మాలు, రెడ్డిరాజుల నారాయణ, జాటోత్ శ్రీను నాయక్, గోడిశాల రాములు, కాసర్ల యాదిరెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు .