
డబ్బుల వసూళ్లకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్
చిట్యాల: మావోయిస్టు ముసుగులో డబ్బుల వసూళ్లకు పాల్పడిన వ్యక్తిని గురువారం అరెస్ట్ చేసి కో ర్టులో హాజరుపరిచినట్లు సీఐ మల్లేశ్ తెలిపారు. సీఐ కథనం ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం రంగయ్యపల్లికి చెందిన పల్లెపాటి గోపాల్‌రావు మద్యం, పేకాటకు బానిసయ్యాడు. అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో మావోయిస్టు పేరుతో ఓ లేఖను సృష్టించాడు. అనంతరం పది రోజుల క్రితం చిట్యాల మండలం శాంతినగర్ శివారులోని శ్రీ లక్ష్మీనర్సింహ రైస్ మిల్లు యజమాని శేఖరయ్యకు ఫోన్ చేసి మీతో మాట్లాడాలని చెప్పి మావోయిస్టు పార్టీ ఇచ్చినట్లు ఓ కవర్ అందించాడు. అందులో పార్టీ కోసం రూ.25 లక్షలు చందా రూపకంగా ఇవ్వాలని ఉంది. అలాగే, ప్రస్తుతం రూ. లక్ష ఇవ్వాలని, లేనిపక్షంలో చంపేస్తానని బెదించాడు. వారం రోజుల్లో రూ.25 వేలు ఇవ్వాలని, లేకపోతే చంపుతానని హెచ్చరించాడు. దీంతో రైస్‌మిల్లు యజమాని శే ఖరయ్య బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి అప్రమత్తయ్యారు. ఈ క్రమంలో గురువారం డబ్బులు తీసుకోవడానికి వస్తున్న గోపాల్‌రావును కై లాపూర్ క్రాస్ వద్ద పోలీసులు ఆపి విచారించగా నిజం ఒప్పుకున్నాడు. దీంతో అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. మావోయిస్టుల పేరుతో ఎవరైనా చందాల వసూళ్లకు పాల్పడితే పోలీసుల దృష్టికి తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో ఎస్సై శ్రావన్‌కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.