
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
చిన్నగూడూరు: ప్రజాసంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తోందని డిప్యూటీ స్పీకర్, డోర్నకల్ ఎమ్మెల్యే జాటోత్ రాంచంద్రునాయక్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కొత్త రేషన్‌కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేనివిధంగా సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ అన్ని సామాజిక వర్గాల సంక్షేమం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో ఒక్క రేషన్‌కార్డు కూడా పంపిణీ చేయలేదన్నారు. ప్రజా ప్రభుత్వంలోనే రేషన్‌కార్డుల కల సాకారమైందన్నారు. రేషన్‌కార్డు రానివారు చింతించకుండా మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రజాసంక్షేమమే దిశగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించాలన్నారు. ఆకేరువాగు నుంచి ఇసుక అనుమతులు స్థానికులకే ఇవ్వాలని తహసీల్దార్, ఎస్సైలకు సూచించారు. అనంతరం మండలంలోని జయ్యారంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో కొత్తగా ఏర్పాటు చేసిన ఎరువుల దుకాణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో డీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్, తహసీల్దార్ సంపత్‌కుమార్, ఎంపీడీఓ కిన్నెర యాకయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రావుల రాంరెడ్డి, నాయకులు కృష్ణారెడ్డి, మురళీధర్‌రెడ్డి, ఎస్సై ప్రవీణ్‌కుమార్, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ స్పీకర్
రాంచంద్రునాయక్