తలకెక్కించుకోవాల్సిందే... | - | Sakshi
Sakshi News home page

తలకెక్కించుకోవాల్సిందే...

Jun 23 2026 1:28 AM | Updated on Jun 23 2026 1:28 AM

ట్రాఫిక్‌ నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

ఈ ఏడాది నమోదైన

ఉల్లంఘన కేసులు ఇలా...

పత్రాలు లేకుండా

డ్రైవింగ్‌

మద్యపానం

హెల్మెట్‌ వినియోగం విషయంలో కూడా జిల్లాలో ఇంకా నిర్లక్ష్యం కనిపిస్తోంది. శిరోభారం అనే ఆలోచనను వాహనదారులు వీడాల్సిన అవసరముంది. ఆరునెలల వ్యవధిలో ఏకంగా 3,145 మంది వీటిని ధరించకపోవడం వల్ల జరిమానా రూపంలో భారీగా ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు. సిగ్నల్‌ జంపింగ్‌, అధిక బరువు, మైనర్లు వాహనాలు నడపటం, అదనంగా ప్రయాణికులను తీసుకెళ్లడం లాంటి కేసుల సంఖ్య కూడా తగ్గేలా వాహనదారుల్లో మార్పు రావాల్సిన అవసరం స్పష్టంగా కనిపిస్తోంది.

కర్నూలు: హెల్మెట్‌ లేకుండా బైకులపై రయ్‌మని దూసుకెళ్లడం.. మద్యం తాగిన తర్వాత వాహనాన్ని నడపటం.. వ్యతిరేక మార్గంలో ప్రయాణించడం.. పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం.. లైసెన్స్‌, వాహనాల పత్రాలు లేకుండానే డ్రైవింగ్‌ చేయడం.. పరిపాటిగా మారింది. ట్రాఫిక్‌ నిబంధనలకు విరుద్ధమైన ప్రయాణాల జోరు జిల్లాలో పెరుగుతోంది. ఏమవుతుందనే సాహసమో.. ఒక్కసారే కదా అనే నిర్లక్ష్యమో ఏదైమైతేనేమి వాహనదారుల జేబుకు చిల్లు పడుతోంది. ఎవరికి వారుగా చిన్నపాటి మొత్తంగానే భావించినా ట్రాఫిక్‌ ఉల్లంఘనకు వాహనదారులు తగిన మూల్యాన్ని మాత్రం భారీగానే చెల్లించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. 2026 జనవరి నుంచి జూన్‌ 20వ తేదీ వరకు ఆరు నెలల వ్యవధిలోనే ఉల్లంఘనలకు సంబంధించి 57 వేలకు పైగా కేసులు నమోదైన తీరు పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.

మొదటి స్థానంలో లైసెన్స్‌,

రికార్డులు లేని కేసులు

57 వేల కేసుల్లో లైసెన్స్‌, వాహన పత్రాలు లేకుండా నడిపిన కేసులే అత్యధికంగా ఉన్నాయి. ఇందుకు దాదాపు రూ.23 లక్షలకు పైగా వాహనదారులు జరిమానాల రూపంలో చెల్లించారు. నంబర్‌ ప్లేట్లు లేకుండా తిప్పుతున్న వాహనాలపై నమోదైన కేసులు రెండో స్థానంలో ఉన్నాయి. దాదాపు 6,043కు పైగా నంబర్‌ ప్లేట్లు లేని కేసులు నమోదయ్యాయి. ట్రాఫిక్‌ సిగ్సల్స్‌ పడినా పట్టించుకోని వాహనదారులపై కూడా 4,332 కేసులు నమోదయ్యాయి. అలాగే రాంగ్‌ రూట్‌ ప్రయాణాలతో ప్రమాదాల బారిన పడుతున్న సంఘటనలు నిత్యం జిల్లాలో ఏదో ఒక చోట వెలుగు చూస్తూనే ఉన్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపటమే దీనికి కారణమని తెలిసినప్పటికీ వాహనదారుల్లో మార్పు కరువైంది. సమయం కలసివస్తుందని కొందరు వాహనదారులు చేస్తున్న తప్పిదం ఎంతోమంది ప్రాణాల మీదకు తెస్తోంది. యూటర్న్‌ తీసుకుని వెళ్లాలంటే అర కిలోమీటర్‌, కిలోమీటర్‌ ప్రయాణించాల్సి వస్తోందని రాంగ్‌రూట్‌లో వెళ్తున్నారు. పోలీసులు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నప్పటికీ ట్రాఫిక్‌ ఉల్లంఘనలు మాత్రం తగ్గడం లేదు.

‘మత్తు’గా దొరికిపోతున్నారు!

మద్యం తాగి వాహనాలు నడపొద్దని తనిఖీల సందర్భంగా అధికారులు హెచ్చరిస్తున్నా కేసులు నమోదు చేసి కోర్టు మెట్లు ఎక్కించి భారీగా జరిమానాలు విధిస్తున్నా మందుబాబుల్లో మార్పు కనిపించడం లేదు. మద్యం మత్తులో వాహనాలు తోలుతూ కొందరు ప్రమాదాల బారిన పడుతుండగా పోలీసుల తనిఖీల్లో దొరికి భారీగా జరిమానాలు చెల్లించి ఆర్థికంగా చిత్తవుతున్న వారి సంఖ్య జిల్లాలో రోజురోజుకూ పెరుగుతోంది. ఇందులో యువతే అధిక సంఖ్యలో ఉండటం ఆందోళనకర పరిణామం. గత ఏడాది జిల్లాలో ఏకంగా 9,360 మంది మందు బాబులు తనిఖీల్లో పోలీసులకు దొరికిపోయారు. వారిని న్యాయస్థానాల్లో హాజరుపర్చగా మొదటి ఆరు మాసాలు ఒక్కొక్కరు రూ.3 వేలు, రెండో ఆరు మాసాలు ఒక్కొక్కరు రూ.10 వేల చొప్పున జరిమానా రూపంలో రూ.6.50 కోట్లు మూల్యం చెల్లించారు. అలాగే ఈ ఏడాది ఆరు మాసాల వ్యవధిలోనే 4258 డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు నమోదు కాగా రూ.4.26 కోట్లు జరిమానా రూపంలో చెల్లించుకున్నారు.

ఆటోమేటిక్‌ సిగ్నల్‌ వ్యవస్థ

అందుబాటులోకి వచ్చినా..

ట్రాఫిక్‌ నిబంధనలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా అమలు చేసేందుకు కర్నూలు నగరంలో ఆటోమేటిక్‌ సిగ్నల్‌ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. నగరంలోని రాజ్‌విహార్‌, పాత కంట్రోల్‌ రూమ్‌ సెంటర్‌, పంప్‌హౌస్‌, వెంకటరమణ కాలనీ, ఐదు రోడ్ల కూడలి, సి.క్యాంప్‌ సెంటర్‌, నంద్యాల చెక్‌పోస్టుతో పాటు ప్రధాన రహదారుల్లో వందకు పైగా ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థతో నిఘా ఏర్పాటు చేశారు. ఉల్లంఘనలను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేకంగా పర్యవేక్షణ ఉంది. రక్షణతో పాటు పర్యవేక్షణ కోసం వీటి సంఖ్యను నగరంలో పెంచనున్నారు. అయినప్పటికీ వాహనదారుల ఉల్లంఘనల జోరు కొనసాగుతూనే ఉంది. ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఉన్న కూడళ్లలో ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాహన చోదకులు ఇష్టారాజ్యంగా దూసుకెళ్తున్నారు. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం, ట్రిపుల్‌ రైడింగ్‌ వంటి ఉల్లంఘనలు కూడా ఎక్కువే. మైనర్ల చేతికి ద్విచక్ర వాహనాలు ఇవ్వడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి.

ట్రాఫిక్‌ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తప్పవు. రోడ్డు భద్రతపై వాహనదారులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు జిల్లా అంతటా జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆటోడ్రైవర్లకు, ద్విచక్ర వాహనదారులకు పోలీసులు ప్రతిరోజూ పోలీస్‌స్టేషన్ల వారీగా అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. పదేపదే ఉల్లంఘనలకు పాల్పడే వారికి తనిఖీల సందర్భంగా జరిమానాలు విధిస్తారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కడ జరిగినా, ఇబ్బందికరంగా వాహనాలు నడిపినా డయల్‌ 100 లేదా 112కు సమాచారమివ్వాలి.

– విక్రాంత్‌ పాటిల్‌, ఎస్పీ

లైసెన్స్‌, వాహన 13,640

నెంబర్‌ ప్లేట్లు లేకుండా 6,043

సిగ్నల్‌ జంపింగ్‌ 4,332

ఓవర్‌ స్పీడ్‌ 4,106

వ్యతిరేక మార్గ ప్రయాణం 3,784

ఓవర్‌ లోడ్‌ 3,146

హెల్మెట్‌ లేకుండా డ్రైవింగ్‌ 3,145

సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ 1,089

బహిరంగ ప్రదేశాల్లో 7,963

ట్రిపుల్‌ రైడింగ్‌ 286

అదనపు ప్రయాణికులు 401

సీటు బెల్టు లేకుండా డ్రైవింగ్‌ 249

మైనర్‌ డ్రైవింగ్‌ 52

ట్రాఫిక్‌ నిబంధనలు

పట్టించుకోని వైనం

మద్యం మత్తులో డ్రైవింగ్‌

ఆరు నెలల్లో 57 వేల కేసులు

జరిమానాల జోరుతో జేబులు గుల్ల

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement