సీనియర్‌ సహాయకులుగా ముగ్గురికి పదోన్నతి | - | Sakshi
Sakshi News home page

సీనియర్‌ సహాయకులుగా ముగ్గురికి పదోన్నతి

Jun 23 2026 1:28 AM | Updated on Jun 23 2026 1:28 AM

కర్నూలు(అర్బన్‌): జిల్లా పరిషత్‌ యాజమాన్య పరిధిలోని వివిధ కార్యాలయాల్లో జూనియర్‌ సహాయకులుగా విధులు నిర్వహిస్తున్న ముగ్గురికి సీనియర్‌ సహాయకులుగా పదోన్నతి కల్పించారు. సోమవారం స్థానిక జెడ్పీలో జరిగిన కార్యక్రమంలో పదోన్నతి పొందిన ముగ్గురు సీనియర్‌ సహాయకులకు జిల్లా పరిషత్‌ చైర్మన్‌ యర్రబోతుల పాపిరెడ్డి పోస్టింగ్‌ ఆర్డర్స్‌ను అందించారు. పారదర్శకంగా విధులు నిర్వహించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. పదోన్నతి పొందిన వారిలో పీ మల్లికార్జున రావునును ఆదోని ఎంపీపీ, డీ కిరణ్‌కుమార్‌ను పీఆర్‌ క్యూసీ సబ్‌ డివిజన్‌ కర్నూలు, డీ మౌలాలిని ఎంపీపీ పాణ్యంకు నియమించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ జీవీ రమణారెడ్డి పాల్గొన్నారు.

సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన

తుగ్గలి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 24న జొన్నగిరి వద్ద జియోమైసూర్‌ కంపెనీ ప్రవేట్‌ లిమిటెడ్‌ (ఇండియా) గోల్డ్‌ మైనింగ్‌ కంపెనీ ప్రారంభోత్సవానికి వచ్చేస్తున్న సందర్భంగా సోమవారం జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ సిరి, ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌, జేసీ నూరుల్‌ఖమర్‌ ఏర్పాట్లను పరిశీలించారు. మైనింగ్‌ ప్లాంట్‌లో హెలిప్యాడ్‌, వ్యూ పాయింట్‌, బహిరంగ సభ, స్టాళ్ల ఏర్పాట్లను మ్యాప్‌ ద్వారా తెలసుకున్నారు. కార్యక్రమానికి 5వేల నుంచి 10వేల వరకు ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ మహేశ్వరరెడ్డి, డ్వామా పీడీ నరసింహారెడ్డి, కర్నూలు మున్సిపల్‌ కమిషనర్‌ ఓబులేసు, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్‌, కర్నూలు, పత్తికొండ ఆర్డీవోలు సందీప్‌కుమార్‌, ఓబులేసు, ఆదోని ఇన్‌చార్జ్‌ సబ్‌ కలెక్టర్‌ మధుసూదన్‌రెడ్డి, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

విద్యుత్‌ సమస్యలకు సత్వర పరిష్కారం

ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్‌

కర్నూలు(అగ్రికల్చర్‌): విద్యుత్‌ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని విద్యుత్‌శాఖ ఈఈ, డీఈఈ, ఏడీఈలను ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్‌ ఆదేశించారు. కొత్తబస్టాండు సమీపంలోని విద్యుత్‌ భవన్‌లో సోమవారం ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు డయల్‌ యువర్‌ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహించారు. వినియోగదారుల నుంచి ఫోన్‌ ద్వారా వివిధ సమస్యలపై ఫిర్యాదులు స్వీకరించారు. బిల్లింగ్‌, పోల్స్‌ తదితర వాటికి సంబంధించిన సమస్యలను కొందరు ఎస్‌ఈ దృష్టికి తెచ్చారు. డీఈఈ విజయ భాస్కర్‌ పాల్గొన్నారు.

రేపటి నుంచి పాలిసెట్‌ కౌన్సెలింగ్‌

జూలై 6న సీట్ల కేటాయింపు

కర్నూలు సిటీ: పాలిసెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఈ నెల 24వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎస్‌.జి పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎంవిఎస్‌ఎస్‌ఎన్‌ ప్రసాద్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోపు https://polycet.ap.gov.in అనే వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో బీసీ, బీసీ విద్యార్థులు రూ.700, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.250 రూపాయలు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి రసీదును ప్రింటౌట్‌ తీసుకోవాలన్నారు. ఒకటో ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు ఈ నెల 29 నుంచి జూలై 3వ తేది వరకు ఆన్‌లైన్‌లో ఆప్షన్‌ నమోదు చేసుకోవాలన్నారు. జూలై 4న ఆప్షన్ల మార్పునకు అవకాశం ఉంటుందని, జూలై 6వ తేదీ సీట్ల కేటాయింపు చేయనున్నారన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీలో సీటు పొందిన విద్యార్థులు రూ.4,700, ప్రైవేటు కాలేజీల్లో సీటు పొందిన విద్యార్థులు రూ.25 వేలు ట్యూషన్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు. పూర్తి వివరాలకు 9052437831, 9703535575, 9848202584 అనే నంబర్లను సంప్రదించాలన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement