కూటమి ప్రభుత్వంలో ఓట్ల గల్లంతు ఖాయం | - | Sakshi
Sakshi News home page

కూటమి ప్రభుత్వంలో ఓట్ల గల్లంతు ఖాయం

Jun 23 2026 1:28 AM | Updated on Jun 23 2026 1:28 AM

బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలి

వైఎస్సార్‌సీపీ వర్గీయుల ఓట్లు

తొలగించకుండా జాగ్రత్త పడాలి

ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి

ఆలూరు రూరల్‌: కూటమి ప్రభుత్వంలో వైఎస్సార్‌సీపీ వర్గీయుల ఓట్లు గల్లంతు కావడం ఖాయమని, గ్రామాల్లో బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. సోమవారం ఆయన మండలంలోని కరిడిగుడ్డం, ముద్దనగేరి, కురుకుంద, మూసానహళ్లి, కాత్రికి, గోనేహాల్‌, మనేకుర్తి, అంగస్కల్‌ గ్రామాల్లో పర్యటించారు. బీఎల్‌ఏలు, ఓటర్లను అవగాహన కల్పించారు. ఎన్నికల్లో నేరుగా గెలిచే పరిస్థితి చంద్రబాబుకు లేదన్నారు. వెన్నుపోటులతోనే ఆయన అధికారంలోకి వచ్చారని, తిరిగి అధికారంలోకి రావటానికి ఓట్లు గల్లంతు చేస్తారన్న విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వైఎస్సార్‌సీపీ వర్గీయుల ఓట్లు తీసివేసే ప్రక్రియ కచ్చితంగా సాగుతోందన్నారు. ‘సర్‌’ ప్రక్రియలో బీఎల్‌ఏలు వైఎస్సార్‌సీపీ సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ఓటరు సవరణ చాలా ప్రాధాన్యత ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో అర్హులైన వారు ఓటు వేసేలా జాగ్రత్త తీసుకోవాలన్నారు. వైఎస్సార్‌సీపీకి చెందిన వారి ఓట్లు తొలగించకుండా, డబుల్‌ ఎంట్రీలు లేకుండా చూడాల్సి బాధ్యత బీఎల్‌ఏలపై ఉందన్నారు. కూటమి ప్రభుత్వం రాజకీయ లబ్ధి కోసమై టీడీపీ యాప్‌ ద్వారా తమ వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించే కుట్ర చేస్తోందన్నారు. ప్రతి బీఎల్‌ఏ ఇంటింటికి తిరిగి ఓటర్లకు ఇచ్చిన ఫారాలను పరిశీలించి వివరాలన్నీ పూర్తి చేయించాలన్నారు.

చంద్రబాబు పాలనంతా మోసమే!

హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసగించడం చంద్రబాబుకు వెన్నుతో పెట్టిన విద్య అని ఎమ్మెల్యే విరూపాక్షి అన్నారు. కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా మొక్కుబడిగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి ఉద్యోగాల్ని సైతం లక్షలాది రూపాయలకు అమ్ముకోవడం సిగ్గుచేటన్నారు. అన్నదాత సుఖీభవలో కోత విధించడం సరికాదన్నారు. సూపర్‌ సిక్స్‌ పేరిట మోసం చేసిన చంద్రబాబును గద్దె దింపేందుకు రాష్ట్ర ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ బీఎల్‌ఏలు, ఎంపీటీసీలు, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement